Samagra Kutumba Survey | ఎంతో భద్రంగా..గోప్యంగా ఉంచాల్సిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు ఇలా రోడ్డపాలయ్యాయి. గురువారంమేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా దర్శనమిచ్చాయి. సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీనా సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.
అన్ని ఫారాలు ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయమంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు.. ఇలా రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విషయమై కమిషనర్‌ను వివరణ కోరగా, జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు పడి ఉన్నట్టు తనకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అక్కడికి వెళ్లి, దరఖాస్తులను సేకరించినట్లు చెప్పారు. అర కిలోమీటరు వరకు ఫారాలు పడి ఉన్నాయని ఆయన చెప్పడం గమనార్హం.
– మేడ్చల్, నవంబర్ 14 :