సిటీబ్యూరో: బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఏడెకరాల భూ వివాదానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్థానిక బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. సుధాకర్‌రెడ్డి చేసిన ఫిర్యాదులో ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ -1968 ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. కోర్టులో విచారణలో ఉన్న అంశానికి సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందు ప్రస్తావించడం, తప్పుడు కథనాలతో తన ప్రతిష్టను దెబ్బతీయడం వంటి అంశాలు సుధాకర్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంబర్‌పేట మండలం బాగ్‌అంబర్‌పేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 563/1లో ఉన్న ఏడెకరాల భూమికి సంబంధించి తాను దాఖలు చేసిన శాశ్వత నిషేధాజ్ఞ కేసు న్యాయస్థానంలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని , ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా తదితర ప్రభుత్వ సంస్థలు ప్రత్యర్థులుగా ఉన్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రజా ఫిర్యాదుల పోర్టల్ వివరాల ప్రకారం ఈ ఫిర్యాదు మే 6,2026న కేంద్ర హోం వ్యవహారాల శాఖకు చేరగా, ప్రస్తుతం అండర్ ప్రాసెస్ స్థితిలో ఉందని, ఈ అంశం అదనపు కార్యదర్శి (పోలీస్ 1) రాకేశ్‌కుమార్ సింగ్ పరిధిలో పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తున్నదని సుధాకర్‌రెడ్డి తెలిపారు.