జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సగటును మొత్తం 90 శాతం పనులు పూర్తి కాగా, అందులో సుమారు 49.8036 కిలోమీటర్ల పొడువున నాలాలున్న సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 92.50 శాతం, తకువగా గోలొండ జోన్లో సుమారు 85.50 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఆరు జోన్లలో కలిపి 830.4635 కిలోమీటర్ల పొడువునా నాలాలు ప్రవహిస్తుండగా, ఇప్పటి వరకు 747.0794 కిలోమీటర్ల పొడువున నాలాల్లోని పూడికను వెలికి తీసినట్లు వెల్లడించారు. ఒక రాజేంద్రనగర్ జోన్ లోనే సుమారు 303.2405 కిలోమీటర్ల పొడువున నాలాలు ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు 91 శాతం పూడికతీత పనులు పూర్తయ్యాయి.
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : నగరంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరద ముంపు ముప్పు ముంచుకొస్తున్నది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నా వరద ముంపు తప్పడం లేదు.. అయితే ఈసారి నగరంలో నాలాల పూడికతీత పనుల చుట్టూ కొత్త రాజకీయం, సరికొత్త ఆధిపత్య పోరు నడుస్తోంది. అటు జీహెచ్ఎంసీ , ఇటు హైడ్రా సంస్థల మధ్య ‘మేము చేశామంటే మేము చేశాం’ అనే రీతిలో పోటాపోటీ ప్రచారం సాగుతోంది. మెట్రిక్ టన్నుల కొద్దీ పూడికను ఎత్తేసినట్లు కాగితాల్లో లెకలు చూపిస్తూ అధికారులు ఘనకార్యాలు చాటుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందేమిటంటే.. నాలాల్లో వ్యర్థాలు, పూడిక ఎకడికకడే పేరుకుపోయి ఉన్నాయి.
అధికారుల నివేదికలకు, గ్రౌండ్ రియాలిటీకి అస్సలు పొంతన లేదనే చేదు నిజం బహిర్గతమవుతోంది. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల్లోని పూడిక తీత పనులను చేపట్టిన జీహెచ్ఎంసీ ఈ సారి వర్షాకాలం ప్రారంభం కావటం, ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవకపోవటంతో కొంత ఆలస్యమైనా, జీహెచ్ఎంసీ అధికారులు పనులు తుది దశగా తీసుకువచ్చారు . ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని చిన్న, మధ్య, తరహా నాలాలకు సంబంధించి సుమారు 830.4635 కిలోమీటర్ల పొడువున నాలా పూడికతీత పనులను చేపట్టేందుకు టెండర్లను చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం ఆరు జోన్లలో సగటున దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఆరు జోన్లలో సుమారు రూ. 43.39 కోట్ల వ్యయంతో చేపట్టిన 242 పనుల్లో రెండు వందలకు పై చిలుకు పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం గత నెల రెండో వారంలోనే మొదలైనప్పటికీ, ఈ సారి వర్షాలు భారీగా కురవకపోవడం వల్లే పనులు ఈ స్థాయిలో ముందుకెళ్లాయని అధికారులు పేరొంటున్నారు. మరోవైపు విపత్తుల నివారణే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా సైతం రంగంలోకి తాము వందలాది ట్రక్ లోడ్ల వ్యర్థాలను నాలాల నుంచి క్లియర్ చేశామని ప్రకటనలు గుప్పిస్తోంది.
ఒకానొక దశలో హైడ్రా సోషల్ మీడియా హ్యాండిల్స్, ప్రెస్నోట్ల ఫోటోలు, వీడియోలతో భారీగా ప్రచారం చేసుకుంటున్నాయి..ఈ రెండు సంస్థల పోటాపోటీ ప్రకటనలు..క్షేత్రస్థాయి పరిస్థితులే అర్థం అవుతున్నాయి. బేగంపేట, యూసుఫ్‌గూడ, ఎల్బీనగర్, ఖైరతాబాద్ పరిధిలోని పలు నాలాలను పరిశీలించగా కంటి తుడుపు చర్యలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ ఏ ఏరియాలో ఎవరు క్లీన్ చేస్తున్నారో ఏ మేరకు పూడిక తొలగించారో ఒకరికొకరు స్పష్టమైన సమాచారం లేకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరద ముంపు లేకుండా నగరాన్ని కాపాడటంలో రెండు సంస్థలూ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షం పడితే మా కాలనీలు జలమయం అవుతున్నాయి.. అధికారులు మాత్రం వేల టన్నుల వ్యర్థాలు తీశామని ప్రకటనలు గుప్పిస్తున్నారని మండిపడుతున్నారు. కాగితాల వేట, పబ్లిసిటీ స్టంట్లు పక్కన పెట్టి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.