శామీర్పేట, జనవరి 13 : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి(Hanging) వేసుకుని బలవన్మరణం (Commits suicide,) పొందాడు. ఈ సంఘటన శామీర్పేట స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట్కు చెందిన చాకలి ప్రసాద్(26) అనే వ్యక్తి బతుకు దెరువు కోసం తూంకుంటకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. తూంకుంటలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్థాపానికి గురై పెట్రోల్ బంక్ పరిసరాల్లోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. తన మృతికి ఆర్థిక ఇబ్బందులు(రుణాలు) కారణమని పేర్కొంటూ తన భార్యను ఎవరు ఏమి అనవద్దని, తనను మంచిగా చూసుకోవాలని కుటుంబ సభ్యులను వేడుకుంటున్నట్లు లెటర్ రాసి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.