సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు మొత్తం 19 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో బీఆర్ఎస్ నుంచి 10, ఎంఐఎం నుంచి 7 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. శనివారం మధ్యాహ్నం ఉపసంహరణ గడువు తర్వాత 15 మంది కన్నా..ఎక్కువ ఉంటే ఎన్నిక అనివార్యంగా ఉంటుందని భావించారు. కానీ కాంగ్రెస్ నుంచి వేసిన ఇద్దరు కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, ఈఎస్ రాజ్ జితేంద్రనాథ్, బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లు సబితా కిశోర్, లావణ్య దూసరి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో మిగిలిన 15 మంది ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ప్రకటించారు. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. గతంలో మాదిరిగానే అధికార బీఆర్ఎస్, దాని మిత్రపక్ష ఎంఐఎం ఒప్పందంలో భాగంగానే స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికైనట్లు ఇరు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వీరి పదవీకాలం ఒక ఏడాది పాటు ఉంటుంది. జీహెచ్ఎంసీలో రూ. రెండు కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర విలువైన పనులకు కమిటీ వారానికోసారి సమావేశమవుతుంది. ఇందుకోసం వారంలో ఏదో ఒక రోజును ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. గత పాలక మండలిలో ప్రతి గురువారం నిర్వహించేవారు.
బీఆర్ఎస్ – ఆవుల రవీందర్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, కంది శైలజ, చింతల విజయశాంతి, పడవు అర్చన, మన్నె కవితారెడ్డి, బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, సబిహా బేగం. ఎంఐఎం – గౌసుద్దీన్ మహ్మద్, ఫర్హత్ బిన్ అబ్దుల్ సమిద్ బిన్ అబ్ధాత్, మహ్మద్ ఖాదర్, మహమూద్ నసీరుద్దీన్, మహమూద్ ముజఫర్ హుస్సేన్, రఫత్ సుల్తానా, షహీన్ బేగం.