బోడుప్పల్, జూన్ 3: ఒక వైపు ట్యాంక్‌బండ్ వేదికగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో కరెంటు కోతలతో బోడుప్పల్ పరిసర పరిసర ప్రాంతాల ప్రజలు కరెంటు కోతలతో సతమతమయ్యారు. సాయంత్రం 4 గంటల తర్వాత కురిసిన వర్షంతో పలు చోట్ల చెట్లు, వాటి కొమ్మలు విరిగి విద్యుత్ తీగలు, స్తంభాలపై పడటంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటలు గడుస్తున్నా విద్యుత్ రాకపోవడంతో కాలనీ వాసులంతా ఆగ్రహంతో బోడుప్పల్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహం చెందిన ద్వారకానగర్, శ్రీసాయి నగర్ కాలనీ, బయ్యన్నగూడ, శ్రీనివాసనగర్, బాలాజీనగర్, ఆనంద్‌నగర్ కాలనీ, ఓల్డ్ విలేజ్, యాదవ్ బస్తీ, జ్యోతినగర్ కాలనీవాసులు సబ్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే వందలాది మంది కాలేజీ విద్యార్థులు కాలనీవాసులకు మద్దతుగా నిలిచారు. గత ప్రభుత్వ హయాంలో లేని విద్యుత్ కోతలు ఇప్పుడెందుకు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్‌గౌడ్, తిరుపతి యాదవ్ నిరసనలో పాల్గొన్నారు. ఆరు నెలలుగా విద్యుత్ సరఫరాలో జరుగుతున్న లోపాలపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని లక్ష్మీగణపతి కాలనీ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి ఆరోపించారు. వర్షాలు వచ్చినప్పుడల్లా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మహమ్మద్ అలీ, ప్రవీణ్ పేర్కొన్నారు. ఇదే విషయమై విద్యుత్ శాఖ అధికారులు సాయంత్రం 5.20 రాత్రి 10.25 వరకు బోడుప్పల్ పరిధిలోని తలెత్తిన విద్యుత్ అంతరాలను సరిదిద్దామని, పునరుద్ధరణ పనుల్లో జాప్యం కావడానికి చాలా కారణాలు ఉన్నాయని ట్విట్టర్ వేదికగా వివరించారు. ఒకేసారి 5 ప్రాంతాల్లో వర్షానికి చెట్లు, వాటి కొమ్మలు పడిపోవడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అన్ని చోట్ల చెట్లను తొలగించి, విద్యుత్ లైన్లను, స్తంభాలను సరిచేసేందుకు సమయం పట్టిందని, కొన్ని ఫీడర్ల నుంచి వచ్చే లైన్లలో విద్యుత్ సరఫరా జరగలేదని అధికారులు వివరణ ఇచ్చారు.
అకాల వర్షం, ఈదురు గాలులతో సమస్య జఠిలమైంది. పిడుగుపాటుతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సబ్ స్టేషన్లో నలుగురు సిబ్బందిని అందుబాటులో ఉంచాం. మరోసారి జరగకుండా చూసుకుంటాం.
గత ఆరు నెలలుగా విద్యుత్ సరఫరాలో విపరీతమైన అంతరాయం ఏర్పడుతుంది. వయసు పైబడినందున ఇంటికి లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్నాం. కరెంట్ హెచ్చుతగ్గులతో మదర్ బోర్డుతో పాటు ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. సుమారు రూ.లక్ష వరకు ఖర్చయ్యింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల రోజే 6గంటల వ్యవధిలో సుమారు 19సార్లు కరెంట్ కట్ అయ్యింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
(1969 తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు)
రోజంతా పనిచేసి ఇంటికి రాగానే కరెంట్ కోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. వేసవికాలమంతా విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇలానే కొనసాగితే ప్రభుత్వంపై త్వరలో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఉచిత విద్యుత్ సాకుతో ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించక ఇబ్బందులకు గురిచేస్తున్నది. వివిధ కారణాలతో రోజుకు 12గంటల కరెంట్ కూడా అందివ్వడం లేదు.