సిటీబ్యూరో, ఆగస్ట్ 13 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో భారీవర్షాలు పడే అవకాశమున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో టిజిఎస్పిడిసిఎల్ తమ పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇంజనీర్లు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్‌లో ఉంటూ 24గంటలు అందుబాటులో ఉండాలని సిఎండి ముషారఫ్ ఫరూఖి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా బుధవారం హుస్సేస్‌సాగర్ సబ్‌స్టేషన్‌ను డైరెక్టర్ డా.నర్సింహులుతో కలిసి సిఎండి సందర్శించారు.
అక్కట ఈఆర్టి వాహనాలను, ఎఫ్ఓసి ఆటోల్లో ఉన్న పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎండి ముషారఫ్ మాట్లాడుతూ అతి భారీ వర్షాలు కురిసినప్పుడు వరద అపార్ట్మెంట్ సెల్లార్లలో చేరి విద్యుత్ మీటర్లు ఉన్న ప్యానల్ బోర్డును తాకే అవకాశముంటుందని అలాంటి ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరా పరంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు కలిగినా తమ విద్యుత్ బిల్లుపై కింది భాగంలో ముద్రించిన అధికారులకు గానీ, 1912కు కానీ, స్థానిక ఎఫ్ఓసికి కానీ కాల్చేయాలని వినియోగదారులకు సిఎండి సూచించారు.
వర్షాల నేపథ్యంలో కార్పొరేట్ కార్యాలయంతో పాటు ఇతర జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పనిచేసే దాదాపు 200మంది ఇతర విభాగాల అధికారులను, సిబ్బందిని క్షేత్రస్థాయి ఆపరేషన్ సర్కిళ్లకు కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 213 సెక్షన్ ఆఫీసులకు చెందిన ఫ్యూజ్ కాల్ ఆఫీసుల్లో జిపిఎస్ ఆధారంగా పనిచేసే అత్యాధునిక ఆటోలు, సంస్థ పరిధిలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యుత్ అంబులెన్స్ తరహాలో 167 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాహనాలు, సరపడా సిబ్బందితో ఉన్నామని సిఎండి ముషారఫ్ ఫరూఖి తెలిపారు.