సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఐదు నెలల పాటు వాయిదాపడిన బల్దియాలోని అనేక అంశాలు వెంటనే ముందుకు తీసుకెళ్లేలా.. తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. శనివారం సీఎం నివాసంలో కలిసిన మేయర్.. ప్రధానంగా జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాలన్నారు.
దీంతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, బల్దియా సర్వసభ్య సమావేశం నిర్వహణపైనా కమిషనర్ రోనాల్డ్ రాస్కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిపాలన సజావుగా సాగడంతో పాటు రాష్ట్ర రాజధానికి అత్యంత కీలకమైన బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయ్యేలా సర్వ సభ్య సమావేశాన్ని నేరుగా నిర్వహించేలా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని మేయర్ కోరారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే మరింత కాలం పలు అంశాలు పెండింగ్‌లో పడతాయని మేయర్, సీఎం దృష్టికి తెచ్చారు. బల్దియా బడ్జెట్ ఆలస్యం కావడంతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కార్పొరేటర్ల నుంచి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటుకు తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. కాగా, మేయర్ తన దృష్టికి తెచ్చిన అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్తో వివిధ అంశాలపై ఫోన్లో మాట్లాడారు.
జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివారం బల్దియా అంశాలపై సమావేశం నిర్వహించేందుకు సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, కేవలం పరిపాలనపరమైన అంశాలు, మున్సిపల్ శాఖకు బాధ్యత వహిస్తున్నది సీఎం కావడం, అన్నింటికంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్ కోడ్ రాకముందే జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను ఆమోదించుకోవాలన్న ఉద్దేశంతోనే సీఎంను కలిసినట్లు మేయర్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు.