అంబర్ పేట, ఏప్రిల్ 11 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం ఫూలే అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. అంబర్పేట అలీ కేఫ్ చౌరస్తాలో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుతో కలిసి సీఎం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలకు విద్యా హక్కు, బాల్య వివాహాలను అరికట్టడానికి పూలే జీవితం అంతా కృషి చేశారన్నారు. జ్యోతిబాఫూలే సతీమణి సావిత్రీబాయి ఫూలే కూడా గొప్ప సంస్కర్త అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రీబాయి ఫూలే జయంతిని తెలంగాణలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ఆమెను గౌరవించుకుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లోనే నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.