ఎకరం వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నెలకు 1500 యూనిట్లు కూడా అమ్ముకోలేని దుస్థితికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. ఇదేదో ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వ్యతిరేకులు చెబుతున్నవి కాదు. పలు రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థల నివేదికల్లో తేలింది. తాజాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారు. “ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా ఇదే తీరుగా ఉంది” అంటూ నిజాన్ని ఒప్పుకున్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఫోర్త్ సిటీ, మూసీ డెవలప్మెంట్ పేరిట మార్కెట్‌ను హైప్ చేసే ప్రయత్నం చేసినా… క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని సీఎం ప్రకటనతో తేటతెల్లమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మార్కెట్ పడిపోయిందంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న నిట్టూర్పు ప్రకటనలను హెచ్ఎండీఏ ముందుగానే గుర్తించినట్లు ఉంది. నగరంలో డెవలప్ చేసిన భూముల వేలం పై పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపాదిత లే అవుట్లలో భూములను విక్రయించాలని భావించినా… మార్కెట్ లేని కారణంగా అడుగులు వెనక్కి వేస్తున్నారు. దీంతోపాటు గతంలో హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి భూములు సేకరించి, వాటిని డెవలప్ చేసే ప్రణాళికలను కూడా పక్కనపెట్టినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ కేంద్రంగా మార్కెట్ మెరుగుపడే వరకు భూముల వేలంపై ఎలాంటి చర్యలు ఉండవని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.
రియాలిటీకి హాట్ కేక్ లాంటి మహానగరంలో క్రయవిక్రయాలు లేక బోసిపోతుంది. దసరా, దీపావళితో కళకళలాడే రియల్ ఎస్టేట్ కార్యాలయాలు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో భూములకు వేలం నిర్వహించడం తప్పుడు నిర్ణయమని హెచ్ఎండీఏ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్ లేనప్పుడు మెరుగైన మౌలిక వసతులతో డెవలప్ చేసిన ప్లాట్లను విక్రయిస్తే అంచనాలకు మించిన ఆదాయాన్ని పొందలేమని ముందుగానే అంచనా వేశారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా భూముల వేలం పై హెచ్ఎండీఏ బ్యాక్ స్టెప్ వేస్తోంది.
నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్ తరహాలో నూతన నివాస ప్రాంతాలను డెవలప్ చేయాలని అప్పట్లో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని లేమూరు, ఇనుమల్ నర్వ, భోగారం, ప్రతాప సింగారం వంటి ప్రాంతాల్లో దాదాపు 1200 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి డెవలప్ చేయాలని భావించారు. కానీ నిర్వహణ, నిధుల కొరత, రైతుల సమన్వయం లేకపోవడంతో పాటు, ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ప్రతిపాదిత ప్రణాళికలను నిలిపివేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోనైనా కనిపించే ఓపెన్ లే అవుట్ల క్రయవిక్రయాలు కూడా ఆశించిన మేర జరగడం లేదు. కనీసం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు అయినా డిమాండ్ ఉందంటే నెలలో 1500 నుంచి 1800 యూనిట్లు కూడా విక్రయించ లేకపోతున్నామని బిల్డర్లు, డెవలపర్లు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో భారీ వ్యయంతో డెవలప్ చేసి తక్కువ ధరకు విక్రయించడం సరికాదని హెచ్ఎండీఏ భావిస్తోంది. గతంలో కోకాపేట్, బుద్వేల్ లాంటి ప్రాంతాల్లో నిర్వహించిన భూముల వేలంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు నేలచూపులతో నెట్టుకొస్తుంటే భూములను విక్రయించినా.. ఆశించిన ఆదాయం పొందలేమని లెక్కలు వేసుకుంటున్నారు. హెచ్ఎండీఏ ఇప్పటివరకు నిర్వహించిన లే అవుట్లలో మిగిలిపోయిన, తాజాగా బంజారాహిల్స్‌లోని 12 ఎకరాల భూమిని డెవలప్ చేసి విక్రయించాలనే ప్రతిపాదనల నేపథ్యంలో… వాటికి బ్రేకులు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. డిమాండ్ లేనప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలని అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపు వెయ్యికి పైగా మిగిలిన ప్లాట్లను ఇప్పుడు వేలం వేయడం కూడా సరైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.