షాబాద్, డిసెంబర్ 7: హైదరాబాద్ అభివృద్ధి ఫలితం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనాలు చేకూరుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించాక హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైటెక్ సిటీలోని మైండ్ స్పెస్ నుంచి మెట్రో రైలుకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.
చరిత్రాత్మక కట్టడాలను రక్షిస్తూ మెట్ల బావిని మనుగడలోకి తీసుకువచ్చిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. ఈ నెల 9న రంగారెడ్డిజిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం మైండ్ స్పేస్ వద్ద ఎయిర్పోర్ట్ మెట్రోకు శంకుస్థాపనతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గం పోలీసు అకాడమీ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో దశలో 31 కిలో మీటర్ల మేరకు రూ.6,250 కోట్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మించనున్న మెట్రోతో ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలుకుతున్నట్లు మంత్రి తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. 9న జరిగే సీఎం సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, నాయకులు కృష్ణారెడ్డి, హన్మంత్రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.