కాప్రా/ ఉప్పల్/ మల్లాపూర్, అక్టోబర్ 26 : దేశంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పిలుపు ఇచ్చారు. గురువారం మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా బండారి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని అన్నారు. తనకు టిక్కెట్ వచ్చాక ఉప్పల్‌కు వంద పడకల హాస్పిటల్‌ను, పలు కాలనీలను నివాస జోన్లుగా మార్పిడి చేయిస్తూ జీఓ జారీ అయ్యేలా కృషి చేశానన్నారు.
నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగేలా చిత్తశుద్ధితో కృషిచేస్తానని, విద్యార్థుల భవిష్యత్‌కోసం, జూనియర్, డిగ్రీ కళాశాలలను మంజూరు చే యిస్తానని అన్నారు. తమ బీఎల్ఆర్ ట్రస్టుద్వారా ఎంతో మందికి విద్య, వైద్యం కోసం ఆర్థిక సహాయం అందజేశానని, సేవా కార్యక్రమాలతో పాటు ఉప్పల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఉప్పల్‌లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు ప్రణాళికాబద్దంగా కృషిచేయాలని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించేలా ప్రజలు తీర్పు ఇస్తారని బీఎల్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపుకై అనుసరించాల్సిన విధి విధానాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉప్పల్ బీఆర్ఎస్ ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి వివరిస్తూ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి కార్యకర్తలే బలం అని, అందరిని కలుపుకుపోతూ పార్టీ సైన్యాన్ని పెంచుకుంటూ ప్రచారం చేయాలని అన్నారు. సోషల్ మీడియా వేదికగా మ్యానిఫెస్టోను సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఇంటింటికి తిరిగి వివరిస్తూ, కాంగ్రెస్, బీజేపీల ఫేక్ హామీలను, విషప్రచారాలను ఎప్పటికప్పు డు తిప్పికొట్టాలని గులాబీదండుకు సూచించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పాలన దేశంలోని అన్నిరాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఉప్పల్‌లో భారీ మెజారిటీతో బండారి గెలువడం తథ్యమని అన్నా రు.
అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని, కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ మోడ్రన్ సిటీగా , ఐటీహబ్‌గా మారిందని కొనియాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని, బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశం మధ్యమధ్యలో గులాబీల జెండా పాటను వినిపిస్తూ నాయకులు, మహిళా కార్యకర్తల్లో జోష్ నింపారు. సభకు భారీగా హాజరైన కార్యకర్తలు ఉత్సాహంగా స్పందిస్తూ ప్రసంగాలకు కరతాళ ధ్వనులతో బిగ్గరగా నినాదాలు చేశారు. సమావేశం అయ్యాక ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, నాయకులను, మహిళా నాయకులను కలిసి వారితో ముచ్చటిస్తూ కలివిడిగా తిరిగారు. కార్యకర్తలు వారితో కరచాలనాలు చేస్తూ ఫొటోలు దిగారు.