పచ్చటి పల్లెటూళ్లో పంచాయితీలు పెట్టే భూతగాదాలను నివారించేందుకే ధరణిని అమలు చేస్తున్నామని అందువల్లే గ్రామాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిరిసిల్లలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. రైతుల ఆస్తి పక్కాగా ఉండాలన్న సదుద్దేశంతో అమలు చేస్తున్న ఈ స్కీం వల్ల 98 శాతం మంది రైతులు లాభపడ్డారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా రైతులపై భారం పడొద్దని కరెంటు మీటర్లు పెట్టనీయలేదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నుంచి చల్లగ బతికే రోజులు తెచ్చినందుకు మంత్రి, నియోజకవర్గ శాసన సభ్యుడు కేటీఆర్‌ను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు.
షోలాపూర్ తరహాలో సిరిసిల్లను తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరారని, ఇదే తరహాలో సిరిసిల్లను షోలాపూర్‌లా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు. ఎందుకండీ అన్నన్ని గంటలు కరెంట్ ఇచ్చేది’ అని పీసీసీ అధ్యక్షుడు తన మనసులో మాట బయటపెట్టుకున్నాడని చెప్పారు. 24 గంటల కరెంట్ కావాల్నో, మూడు గంటల కరెంట్ కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.