పాలమూరును సర్వనాశనం చేసింది.. గంజి కేంద్రాలు పెట్టించే గతి తెచ్చిన పార్టీ కాంగ్రెస్సే.. కృష్ణా, తుంగభద్ర ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటుగాకుండ ఆగం చేసి కరువుపాలు చేసిన పార్టీ అదే.. గద్వాలను గబ్బుపట్టించింది వాళ్లే.. వాల్మీకి, బోయల కొంపముంచింది వీళ్లే.. ఆనాడు కాలని మోటర్.. ఎండని పొలం లేకుండే.. మీ పెద్దలను అడిగినా ఇదే విషయం చెబుతారు. మళ్లీ అదే రాజ్యం కావాల్నా..? నేను చెప్పింది నిజమైతే బీఆర్ఎస్కు ఓటు వేయండి.. నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
సోమవారం దేవరకద్ర నియోజకవర్గం అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల్ నియోజకవర్గం అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్ నియోజకవర్గం అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట నియోజకవర్గం అభ్యర్థి రాజేందర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు.
మనం గొడగొడ ఏడ్చుకుంటూ వలసలు పోయిననాడు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరైనా జై తెలంగాణ అన్నారా..? జై తెలంగాణ అన్నోళ్లను జైల్లో వేసిండ్రు.. చంపిండ్రు.. కొట్టిండ్రు.. లాఠీ చార్జి చేసిండ్రు.. ఇప్పుడు తెలంగాణ పచ్చబడ్డది కాబట్టి మళ్లా కరుగనాకాలి. మళ్లీ ప్రజల గుండు కొట్టాలి. దానికోసం వాళ్ల ఆరాటం తప్ప తెలంగాణ బతుకుల కోసం కాదు. ఏ మాత్రం పొరపాటు చేసిన ఇబ్బందులు వస్తాయి. గ్రామాల్లో చర్చ పెట్టండి.. ఏది నిజమో ఆలోచించి.. అభివృద్ధి చేసే కారు గుర్తుకు ఓటేయండి.