ఒకప్పుడు కరువుతో గొడగొడ ఏడ్చిన తెలంగాణను పదేండ్లు కష్టపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకువచ్చాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, పరకాల నియోజకవర్గం అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. వ్యవసాయాన్ని నిలబెట్టాలని నీటి తీరువా రద్దుచేశాం. 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. రైతు బంధు పథకాన్ని పుట్టించి పెట్టుబడి అందిస్తున్నాం. పండించిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ఊర్లలోనే కొనుగోలు చేస్తున్నాం. ఇవన్నీ మీ కండ్ల ముందరే జరుగుతున్నాయి. ఈ కష్టం బూడిదలోపోసిన పన్నీరు కావాల్నా..? ఇదే ప్రగతి కొనసాగాల్నా..? ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ కాంగ్రెసోడు అంటడు.. 3 గంటల కరెంటు ఇస్తాం.. రైతులంతా 10 హెచ్పీ మోటర్లు కొనుక్కోవాలని.. దానికి సొమ్ము నీ అయ్య ఇస్తడా..? 30 లక్షల మోటర్లు ఎవరు మార్చాలే..? నోట్లకెళ్లి ఉట్టిగా మాట్లాడితే అయిపోతదా..? నెత్తా కత్తా.. ఏది పడితే అది మాట్లాడితే ఎట్ల.. ఇది వాళ్ల వైఖరి.
కేంద్రానికి నేనే స్వయంగా 100 ఉత్తరాలు రాసినా.. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే. పార్లమెంట్ పాస్ చేసిన చట్టాన్ని కూడా మోదీ ఉల్లంఘించి ఒక్క నవోదయ స్కూల్ రాకుండా చేసిండు. మనం పన్నులు కడుతలేమా.? దేశంలో మనం భాగం కాదా..? ఇక్కడున్న బీజేపీ నాయకులు పెద్దగ నీలుగుతరు.. మోదీతోఎందుకు మాట్లాడలేదు. మన మీద పగ పట్టిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టకుంటే రూ.25 వేల కోట్లు కోత పెట్టినందుకా..? ఇక్కడి ఎంపీలు ఎందుకు పనికిరారు. వీళ్లు గెలిచి చేసింది ఏది.. పొడిచేది ఏందీ..? ఇన్నేండ్లాయే.. ఏకాన పని అయ్యిందా..? ఆషామాషీగా ఓటు వేస్తే నష్టపోతాం. మంచిచేసే బీఆర్ఎస్కు ఓటువేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అని సీఎం కేసీఆర్ అన్నారు.