కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతిలో గెలవడం చేతగాక.. దాడులకు పాల్పడుతున్నారని.. మాకు తిక్కరేగితే దుమ్ము రేగుతది. తస్మాత్ జాగ్రత్త.. అంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇది రాజకీయమా..? అరాచకమా..? అంటూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఇవ్వాల బ్రహ్మాండంగా రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతాఉంటే కండ్లలో నిప్పులు పోసుకొని మన మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి దాడులను ఓటు ద్వారానే తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు హన్మంత్ షిండే, పోచారం శ్రీనివాస్ రెడ్డి, భూపాల్ రెడ్డిలకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు అనగానే అనేక పార్టీలు వస్తాయి.. అనేక మంది నేతలు వచ్చి ఓట్ల కోసం అనేక మాటలు చెప్తారు.. కానీ ఆలోచన చేసి ఓటు వేయాలి. ఓటు ఒక బ్రహ్మాస్త్రం.. దాన్ని సరైన పద్ధతుల్లో వాడితేనే మన తలరాత మారుతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
పదేండ్ల కింద మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండే.. ఇవాళ ఎలా ఉన్నదో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో ఏం జరుగుతున్నదో.., మహారాష్ట్రలో ఏం గతి ఉన్నదో మీకందరికీ తెలుసని.., ఆ రెండు రాష్ర్టాలలో రైతులను పట్టించుకునే నాథుడే లేడన్నారు. కర్ణాటకలో 24 గంటల కరెంటు ఇస్తమని కాంగ్రెస్ ఓట్లు వేయించుకొని.. తీరా గెలిచాక 5 గంటలే ఇస్తున్నదని, దీంతో అక్కడి రైతులు కరెంటు సరిపోక పంటలు ఎండిపోయి పురుగుల మందు తాగి చనిపోతామంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే.. రైతు బంధుకు రాంరాం.. కరెంటును కాట కలుప్తరు., ధరణిని తీసేసి.. దళారీ రాజ్యం తెస్తరని అన్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.