కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నరు. వాళ్లకు ఒక్క ఛాన్స్ కాదు.. ప్రజలు ఇప్పటికే 10, 11 ఛాన్స్‌లు ఇచ్చిండ్రు. మరి ప్రజల కోసం ఏంజేసిండ్రు.? అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గం అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 50 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచి నీళ్లయినా తెచ్చియ్యగలిగిండ్రా.? పైగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరట.
అసలు ధరణి పోర్టల్ ఎందుకు తెచ్చినం..? భూముల క్రయ విక్రయాల్లో అక్రమాలను అరికట్టడానికేగా..? రైతులు అధికారుల చుట్టూ తిరుగొద్దని., లంచాలు ఇయ్యొదనే.. రైతుల బొటన వేలుకు అధికారం ఇచ్చాం. ధరణి పుణ్యమనే ఇయ్యాల రైతుకు రైతు బంధు, రైతు బీమా, వడ్ల పైసలు వస్తున్నయి. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తే ఇవన్నీ వస్తయా..? నేను రావాల్సిన వాటిపై మీకు అధికారాలు కట్టబెడితే కాంగ్రెసోళ్లు ఆ అధికారాలను ఊడగొడ్తమంటున్నరు. 24 గంటల కరెంటు తీసేసి.. 3 గంటలే ఇస్తరంట..రైతుబంధు వేస్ట్ అని మాట్లాడుతున్నరు.
10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంట.. రైతులకు 10హెచ్‌పీ మోటర్లు వీడి అయ్య కొనిస్తడా.? లంబాడీ బిడ్డలు తమ తండాలను పంచాయతీలు చేయాలంటే చేసిండ్రా..? చెయ్యలే.. ఇప్పుడు గిరిజనుల గురించి పెద్ద మాటలు చెప్తున్నరు. బీఆర్ఎస్ ప్రతి తండాలను పంచాయతీగా మార్చేసింది. దళితుల కోసం దళితబంధు తెచ్చినం.. మరి బీఆర్ఎస్ కంటే ముందు ఎవడన్నా దళితుల గురించి ఆలోచించిండా.? నాడు రూ.200 పెన్షన్ మొఖాన కొట్టి మీ చావు మిమ్మల్ని చావమన్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2వేలు చేసినం.. రూ.5వేలకు పెంచుతామని ప్రకటించాం.
దేశంలో ఎక్కడాలేని విధంగా 3కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 8 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఆలోచించిందా..? ఆనాడు దోపిడీకి గురైతే పట్టించుకున్నదా.? ఎన్నికలు కాంగనే మార్చి నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యమే సప్లయ్ చేస్తమని ప్రకటించాం. ప్రజలందరికీ ఈ విషయం తెలిసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. 30వ తేదీలోగా ప్రతి గడపకూ ఏది నిజం. ఏది రాయి.. ఏది రత్నమో అనే సందేశం అందాలే. మన గెలుపును ఎవడూ ఆపలేడు.
2014లో గెలిచిన మొదట్లో రెండేండ్లలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తానని ప్రకటన చేసిన. ఆనాడు జానారెడ్డి అపోజిషన్ లీడర్‌గా ఉండే. కేసీఆర్ రెండేండ్లలో కాదు.. నాలుగేండ్లలో కరెంట్ ఇచ్చినా.. నేను కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా కప్పుకొని మీ కార్యకర్తలా పనిచేస్తానని మాట్లాడిండు. కానీ ఏడాదిన్నరలోనే 24 గంటల కరెంటు ఇచ్చి నేను సక్సెస్ అయిన.. కానీ జానారెడ్డి మాట తప్పిండు. అలాంటోడికి మీరంతా గత ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పిండ్రు. ముఖ్యమంత్రి కల గంటున్న జానారెడ్డికి ఇప్పుడు కూడా అదేవిధంగా బుద్ధిచెప్పాలి.