సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేయాలని చూసిన అక్రమార్కుల ఆగడాలకు ఎట్టకేలకు చెక్ పడింది. కబ్జారాయుళ్ల నుంచి ఆ స్థలాన్ని కాపాడి ప్రహరీ నిర్మించడంతోపాటు గేటు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా నోటీసు బోర్డులను ఏర్పాటు చేశారు. మేయర్ ఆదేశాల మేరకు రెండురోజుల కిందట రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎన్బీటీ నగర్లో రెండు ఎకరాల స్థలంలో సుమారు ఆరేళ్ల కిందట మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిర్మాణానికి అవసరమైన రూ. రెండు కోట్ల నిధులను మంజూరు చేశారు. ఐతే ఈ స్థలంపై కన్నేసిన కొందరు ప్రైవేట్ వ్యక్తులు గుడి ముసుగులో కబ్జాకు ప్రయత్నిస్తూ అధికారులను సైతం బెదిరింపులకు గురి చేశారు. ఇలా పోలీస్ కేసుల వరకు వెళ్లింది. గత వారంలో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మాణం శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసి కబ్జాకు బరి తెగించారు. ఈ విషయాన్ని స్థానికులు కొందరు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా.. మేయర్ వెంటనే జోనల్ కమిషనర్ వెంకటేశ్, డీఎంసీ ప్రశాంతి అధికారులతో కలిసి పర్యటించారు. మేయర్ సీరియస్‌గా తీసుకుని ప్రహరీ నిర్మాణం, గేటు ఏర్పాటు వరకు అధికారులతో సమన్వయం చేశారు. ఖరీదైన స్థలాన్ని కాపాడి ప్రజాప్రయోజనాలకు వినియోగించేలా చేసిన మేయర్‌కు స్థానిక బస్తీవాసులు, మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.