మేడ్చల్/ఘట్కేసర్, మే13: బీఆర్ఎస్తోనే దేశంలో మార్పు సాధ్యమని, తెలంగాణ మోడల్ కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని శనివారం నారాయణ గార్డెన్లో నిర్వహించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పలు రాష్ర్టాల్లో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందని.. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలువడం సంతోషంగా ఉందన్నారు.
మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారని.. ఆ రాష్ర్టానికి చెందిన ఎందరో నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దళితులను ఎవరూ పట్టించుకోలేదని.. ఒక్క సీఎం కేసీఆర్ వారి సంక్షేమాన్ని కాంక్షించి దళిత బంధును ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రభుత్వం అందజేసే రూ.10 లక్షలతో దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని చెప్పారు. కొత్తగా నియోజకవర్గంలో 1100 మందికి దళితబంధు ఇచ్చేందుకు అనుమతి లభించిందని.. త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు అందజేస్తామన్నారు. విద్యా వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించామని.. నిరుపేదలకు వైద్యం అందించేందుకు రూ.10 వేల కోట్లతో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందన్నారు. 58,59 జీవోలను జారీ చేసి పేద బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే గోస పడుతామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలకు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను విమర్శించడం తప్పితే ఇంకా ఏం చేతకాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయని కాంగ్రెస్ ఇప్పుడు అధికారం కోసం నానా హామీలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు కాంగ్రెస్ 24 గంటల కరెంట్‌తో పాటు వృద్ధులు, వికలాంగులు, వింతంతువులు, ఒంటరి మహిళలకు రూ.2106 పింఛన్, రైతుకు పెట్టుబడి సాయం చేసిందా అని ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీ రూ.400లు ఉన్న సిలిండర్ ధరను రూ.1200లకు పెంచిందన్నారు. అన్ని వస్తువుల మీద జీఎస్టీ విధిస్తూ, ధరల పెంచి సామాన్యుడి బతకలేని పరిస్థితులు కల్పించారని విమర్శించారు. మతం పేరుతో అన్నదమ్ముల్లా ఉన్న వర్గాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే బతుకులు ఆగమవుతాయన్నారు. ప్రతిఒక్కరూ ఐక్యంగా కృషి చేసి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలన్నారు. ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసం ఉందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. దేశంలోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతుందని.. భవిష్యత్‌లో దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు అవుతుందన్నారు. నరేంద్ర మోడీని ఓడించే దీటైన నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని అన్నారు.
ఘట్కేసర్ వంతెన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. వంతెన నిర్మాణ పనుల జాప్యంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను పలువురు బీఆర్ఎస్ నాయకులు మంత్రి దృష్టికి తేగా ఈ నెల 18న అధికారులతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ పాలనతోనేఅభివృద్ధి
సీఎం కేసీఆర్ సారధ్యంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనిజంగయ్య యాదవ్ అన్నారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీళ్లు, వైకుంఠధామాలు, పార్కులు తదితర మౌలిక సదుపాయాలు సమకూరాయన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి అభివృద్ధి పనులకు సహకరించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డిని గతంలో కంటే భారీ మోజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, ఘట్కేసర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.