గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అని గోరెటి వెంకన్న చెప్పినట్లు నగరంలో ఉన్న నిరుపేదల పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అత్యంత దయనీయంగా ఉండేది. పొట్టకూటి కోసం కూలీ నాలి చేసుకొని వేలకువేలు ఇండ్ల కిరాయిలు కట్టలేక గరళం చిమ్మే, ముక్కుపుటాలు అదిరేలా దుర్వాసన వెదజల్లే నాలాల పక్కన చిన్నపాటి రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకొని కుటుంబమంతా దోమల దాటికి ఎదురొడ్డి జీవించాల్సిన దుస్థితి వారిది. చిన్నపాటి గాలి దుమారం వచ్చినా.. మోస్తారు వర్షం కురిసినా.. నాలాలు ఉప్పొంగి.. రేకుల షెడ్లు నేలమట్టం కాగా.. ఇంట్లో నిత్యావసరాలు మురికిపాలయ్యేది. తరచూ అనారోగ్య సమస్యలు.. ఇరుకు ఇండ్ల కారణంగా తలెత్తే నేర ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం.. ఇలాంటి వాతావరణంలో ఇక వారి పిల్లల ఆలోచనలూ బస్తీ దాటేవికావు. వీటన్నింటి మధ్య తమ బతుకులు అంతేనని సర్దిజెప్పుకునే ఆ జనాల బతుకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
కమ్యూనిటీ భవంతులను తలపించే భద్రతతో..
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదోడికి ఆత్మగౌరవం చేకూర్చే డబుల్ బెడ్రూం సౌధాలను అందించారు. అవి లబ్ధిదారులకు శ్రీరామరక్షగా నిలిచాయి. కష్టాల సుడిగుండంలో నుంచి సురక్షిత ఇండ్లలోకి వారిని అడుగులు వేసేల చేశాయి. ఓ వైపు పరిశుభ్ర వాతావరణం, మరోవైపు కమ్యూనిటీ భవంతులను తలపించే భద్రతతో వాళ్లు స్వేచ్ఛా గాలులు పీల్చనున్నారు. చుట్టూ పరిస్థితుల కారణంగా బస్తీ పరిధి దాటని వారి ఆలోచనలు ఇకపై వికసించనున్నాయి. సురక్షిత మార్గాల్లో ప్రయాణించేల వారి పరిసరాలు తోడ్పడనున్నాయి. అంతేకాదు ఎదిగే పిల్లలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నూతన ఉత్సాహాన్ని అందించనున్నాయి. ఆత్మవిశ్వాసంతో మంచి భవిష్యత్తు దిశగా ముందడుగు వేస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు. 60 శాతం అనారోగ్యాలు, అంటు వ్యాధుల నుంచి వాళ్లు విముక్తి పొందారని వైద్య నిపుణులు తెలిపారు.
నేర ప్రవృత్తికి దూరంగా ..
మురికి వాడలు, బస్తీలలో ఉండే యువత ఎక్కువగా బాధ్యత లేకుండా రోడ్లపై తిరుగుతూ నేరాల బాట పడుతుంటారు. తమకంటూ ఒక ఇళ్లు ఉందంటే బాధ్యతగా ఎక్కడకు వెళ్లినా రాత్రికి ఇంటికి చేరుకుంటారు. నేరాలు చేసేందుకు భయపడుతారు. మంచి వాతావరణంలో ఉంటే మంచి ఆలోచనలు కూడా వస్తాయి. డబుల్‌బెడ్ రూం ఇండ్లలో ఉండడం వల్ల అక్కడ ఏర్పడే మంచి వాతావరణంతో నేర ప్రవృత్తికి దూరంగా ఉండే అవకాశాలున్నాయి.
– సాయి చైతన్య, సౌత్‌జోన్ డీసీపీ
చెడు అలవాట్లను త్యాజిస్తారు
ఆహ్లాదకరమైన వాతావరణం, సామరస్యపూర్వక మనుషులతో ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటాయి. రోజంతా కూలీ పని చేసి సాయంత్రానికి ఇంటికొచ్చేసరికి భరోసానిచ్చే ఇల్లు కనిపించగానే వాళ్లు కష్టాలన్నీ మరిచిపోయి హాయిగా నిద్రించగలరు. ఫలితంగా వారిలో ఒత్తిడి, ఆందోళన తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత చాలా మంది ఆ జీవన శైలికి అలవాటు పడి తమ పిల్లలు తమకన్న గొప్ప స్థానాల్లో ఉండాలనే ఆలోచనలకు బీజం పడుతుంది. క్రమేణా వారిలో ఉండే మద్యపాన, ధూమ పాన అలవాట్లు సైతం తగ్గించుకుంటారు.
– డాక్టర్ శ్రీపూజ సిద్ధంశెట్టి, క్లినికల్ సైకాలజిస్టు
ఆనంధానికి అవధుల్లేవు
మనిషి మానసిక అంశం తన ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మొన్నటి వరకు కిరాయి ఇండ్లలో ఉండే వారు, నివాసం లేక ఇబ్బందులు ఎదుర్నొన్న వారికి ఇప్పుడు డబుల్ బెడ్రూంలు వారిలో ధైర్యాన్ని నింపాయి. వారి ఆనంధానికి అవధుల్లేవు. గతంలో వ్యతిరేక ఆలోచనలు, సంఘ విద్రోహక చర్యలను ప్రేరేపించే వాతావరణం ఇప్పుడు కట్టడి అవుతుంది. సానుకూల ఆలోచనలతో వారి జీవితాలు మారనున్నాయి. లబ్ధిదారుల జీవన పరిస్థితులు మెరుగుపడి సంఘంలో ఒక నిజాయితీగల పౌరుడిగా ఎదుగుతారు.
– అర్చనా నండూరి, కౌన్సెలింగ్ సైకాలజిస్టు
మన ఆరోగ్యం మన చేతుల్లోనే..
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం నివసించే ఇళ్లు, ఇంటి పరసరాలు పరిశుభ్రంగా, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే 60శాతం రోగాలను అరికట్టవచ్చు. కొన్ని రకాల వ్యాధులతో దవాఖానకు వచ్చే రోగులను పరిశీలిస్తే ఎక్కువ శాతం మంది మురికివాడలకు చెందిన వారే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుంది. మంచి వెలుతురు, గాలి రావడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఏవైన ఆరోగ్య సమస్యలు వచ్చినా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ డి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా హాస్పిటల్
నివాసంతోపాటు ఆరోగ్యం కూడా..
డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో నివాసమొక్కటే కాదు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వారికి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించినట్లుగానే భావించాలి. ఎందుకంటే ఇరుకైన ఇళ్లు, గుడిసెలు, మురికి వాడలను పరిశీలిస్తే అక్కడ సరైన గాలి ఆడదు, సూర్యరశ్మి, వెలుతురు ఉండదు. దీంతో వ్యాధులు ప్రబలినప్పుడు ఎఫెక్ట్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రమైన వాతావరణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. ఇలాంటి వాతావరణం వల్ల ప్రజల మైండ్‌సెట్‌లో కూడా మార్పు వస్తుంది.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ హాస్పిటల్
అన్ని సదుపాయాలు ఉండడంతో …
కాలనీలతో పోలిస్తే బస్తీలు, ఆ తరువాత మురికివాడలలో నుంచి పోలీస్స్టేషన్లకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకు రక రకాల కారణాలు ఉంటాయి. ప్రధానంగా ఇరుకైన రోడ్లు, చిన్న చిన్న ఇండ్లు, ఒకే దగ్గర చాలా మంది ఉండటంతో గొడవలు జరుగుతుంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు గెటెడ్ కమ్యూనిటీలుగా మారుతున్నాయి. లబ్ధిదారులు అసోసియేషన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ప్రశాంతమైన జీవనం సాగించేందుకు మొగ్గు చూపుతున్నారు.
– ఎం.వెంకటేశ్వర్లు, సెంట్రల్ జోన్ డీసీపీ
సానుకూల ఆలోచనలతో విజయాలు
భయానక వాతావరణ పరిస్థితుల్లో నుంచి పరిశుభ్రమైన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రావడం వల్ల వారి జీవన విధానంలో మంచి సత్ఫలితాలు చేకూరుతాయి. వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మురికివాడలు, అధిక రద్దీ, గోప్యత లేని పరిస్థితులు, ఇరుకు గృహాలతో ఇన్నాళ్లు వారిలో ఒక రకమైన ఒత్తిడి ఆవరించి ఉంటుంది. ఇప్పుడు వారు ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించగలరు. దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగుతుంది. కుటుంబ ప్రాధాన్యత పెరగడంతో పాటు అనుబంధాలు మరింత బలపడుతాయి. తల్లిదండ్రులు వారి పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల ఆసక్తి కనబరుస్తారు. తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలనే వాతావరణం ఆటోమెటిక్‌గా ఏర్పడుతుంది. అక్కడున్న వాతావరణం వారిని ఆ దిశగా అడుగులు వేయిస్తుంది.
– డాక్టర్ మోతుకూరి రాంచంద్రం, కౌన్సెలింగ్ సైకాలజిస్టు