కాంగ్రెసోళ్లు ఇవ్వాళ డబ్బుల కట్టలు పట్టుకొని దిగుతున్నరు. ఎన్నికలు అయిపోతే మళ్లీ కనబడరు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని చెన్నూరు ప్రజలు నాలుగుసార్లు ఓడగొట్టారు. మన బెల్లంపల్లిలో ఉన్నవాళ్లము తెలివి తక్కువ వాళ్లమా..? మరి రుజువు చేయాలి. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్ల చెల్లుతది.. వాళ్లు తిరస్కరించిన తర్వాత మనం ఎట్ల గెలిపిస్తాం. ఎన్నికలు రాగానే డబ్బు సంచులు పట్టుకొని దిగాలా.. వాన్ని వీన్ని కొని గోల్ మాల్ చేయాలా.. ఇదే వారి పని. చిన్నయ్య నువ్వేం ఫికర్ చేయకు. ఎవడో నలుగురు అమ్ముడు పోయినంత మాత్రాన వాడు తలమాసినోడు అవుతడు కానీ మనం కాము. ప్రజలు నీ పక్షాన ఉంటారు. ప్రజల ఆశీర్వాదమే మనకు శ్రీరామ రక్ష.
“కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే.. పీసీసీ అధ్యక్షుడే టికెట్లు అమ్ముకున్నాడని గాంధీ భవన్ దగ్గర ప్రతి రోజూ లొల్లి.. గాంధీ భవన్ గేట్లకు తాళాలు వేసుడు. ఇవ్వాల టికెట్లు అమ్ముకున్నోడికి రాష్ర్టాన్ని అప్పజెప్తే.. రేపు రాష్ర్టాన్ని అమ్ముకోడా.? పార్టీ టికెట్లు అమ్ముకునేటోళ్లు కావాల్నా.. ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ కావాల్నా..? దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. మీ దీవెన ఉంటే తెలంగాణను ఈ దేశంలోనే నంబర్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గం అభ్యర్థి చిన్నయ్యకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. “ఆనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టి.. గోస పెట్టిందెవరు.? కరువు పాలు చేసిందెవరు.? వందలాది మంది విద్యార్థుల చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా..? ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటుంటే ఓర్వలేక పోతున్నరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టింది.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఉద్యోగులను పునరుద్ధరించినం. సింగరేణిలో 45వేల మంది కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇచ్చినం.. ఇంక్రిమెంట్లు ఇచ్చినం.. 19,400 ఉద్యోగాలు కల్పించినం. ఈ అభివృద్ధి ఇలానే జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్‌కు అప్పగిస్తే రైతుబంధుకు రాంరాం.. పట్వారీలు, దళారీల రాజ్యం వస్తది. ఆగమైపోయే అవకాశం ఉంటది. మీ అవసరాలు, మంచి చెడు గురించి మీ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలి.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.