పెండింగ్ చలాన్లపై రాయితీ …
అవకాశం మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఈ లోపు డిస్కౌంట్ ఫార్ములాను ఉపయోగించుకోని వారికి ‘ టాప్ వాయిలేటర్స్ టీమ్స్’ అవగాహన కల్పిస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉన్న వాహనదారుల నుంచి చలాన్లు పూర్తిగా వసూలు చేసేందుకు ఈ బృందాలు నేరుగా ఉల్లంఘనదారుల ఇండ్లకే వెళ్తున్నాయి. పెండింగ్ జరిమానాలు క్లియర్ చేసుకోవాలంటూ.. వివరిస్తున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ టీమ్స్ చట్టపరం గా కఠినచర్యలు తీసుకోనున్నాయి. స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నాయి.
– సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ)
ట్రై కమిషనరేట్లో..
మార్చి 1 నుంచి పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు వాహనదారులకు రాయితీ అవకాశాన్ని ఇచ్చారు. ద్విచక్రవాహనదారులకు 75 శాతం, నాలుగు చక్రాల వాహనదారులకు 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో మంచి స్పందన లభిస్తున్నది. మార్చి మొదటి వారం రోజుకు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు, ఆ తర్వాత 6 లక్షల నుంచి 8 లక్షల వరకు చలాన్లు క్లియర్ అవ్వగా, చివరి వారం నుంచి 10 లక్షలకుపైగా వసూళ్లవుతున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 5 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉండగా, మార్చి 28వ తేదీ నాటికి 43 శాతం చలాన్లు వసూళ్లయ్యాయి.
మొత్తం కట్టాల్సిందే
గడువు లోపు పెండింగ్ చలాన్లు చెల్లించుకోవాలని వాహనదారులకు సూచనలు ఇస్తున్నాం. ఎక్కువ మొత్తంలో జరిమానాలు ఉన్నవారిని గుర్తించి.. క్లియర్ చేసుకోవాలని చెబుతున్నాం. 3 రోజులే డిస్కౌంట్ అవకాశం ఉంది. ఉల్లంఘనదారులు సద్వినియోగం చేసుకోవాలి. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ