మలక్ పేట, జూలై 5: గుర్తుతెలియని వ్యక్తులు టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి రూ.50 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన విజయకుమార్ సేవారత్ పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. అతని వద్దకు వచ్చిన నరేందర్, శ్రీకాంత్‌లు తాము ఓ కంపెనీకి చెందిన ప్రతినిధులమని చెప్పి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. కోటి ఫండ్ మీ అకౌంట్లో జమ చేస్తామని, అందుకు ముందుగా రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని.. డబ్బులు తీసుకోవడానికి సోను, నవీన్‌లను పంపిస్తామని చెప్పారు.
శుక్రవారం రాత్రి విజయ్‌కుమార్.. ముసారాంబాగ్‌లో బంధువైన రామచంద్రయ్య ఇంట్లో సోను, నవీన్‌లతో సమావేశం అయ్యారు. రూ.50 లక్షల నగదును రెండు బ్యాగుల్లో ఉంచి విజయకుమార్ వారితో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని బెదిరించి.. రూ.50 లక్షల నగదుతో పాటు సోను, నవీన్ లను కూడా తీసుకుని వెళ్లారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన విజయ్‌కుమార్.. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపారు.