సిటీబ్యూరో : మూసీ నది పునర్జీవం పేరిట ప్రభుత్వం చేపడుతున్న అశాస్త్రీయ విధానాలపై పౌర సమాజం గళమెత్తింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాంక్రీట్ కట్టడాల కోసం వినియోగించడం సరికాదని, శాస్త్రీయ, పర్యావరణ పద్ధతుల్లోనే నదికి పూర్వవైభవం తీసుకురావాలని నిపుణులు స్పష్టం చేశారు. ఈమేరకు పీపుల్స్ కమిటీ ఫర్ మూసీ రిజువనేషన్ తన రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలతో నివేదిక రూపొందించింది. మూసీ పునర్జీవం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీకి ఈ నివేదికను అందజేసింది. రైతులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలను విస్మరిస్తూ సర్కార్ సాగిస్తున్న ఏకపక్ష ధోరణిపై కమిటీ అసహనం వ్యక్తం చేసింది.
రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు, ప్లాంట్ సైంటిస్టులు, పర్యావరణవేత్తలతో ఏర్పాటైన పీసీఎంఆర్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మూసీ నది బేసిన్‌ను ఒక జీవనదిగా చూడాలే తప్ప.. రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చవద్దన్నారు. ముఖ్యంగా హైడ్రోలాజికల్ విధానంలో నది సహజ ప్రవాహాన్ని అడ్డుకోకుండా, వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా పనులు జరగాలన్నారు. నదీ గర్భంలో ఉన్న సూక్ష్మజీవులు, వృక్ష సంపదను కాపాడటం ద్వారానే నదిని శుద్ధీ చేసుకోగలదు. భూసేకరణ పేరిట దేశానికి సేవ చేసిన మేధావులు, శాస్త్రవేత్తల నివాసాలను కూడా నోటిఫై చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసీ సబ్ కమిటీకి ఇప్పటికే ఏప్రిల్ 6, 9 తేదీల్లో రెండు సార్లు వినతి పత్రాలు అందజేసినా, ఇతర అభ్యర్థనలను పక్కనపెట్టి ప్రభుత్వం తన సొంత అజెండాతో ముందుకెళ్లడం ప్రజాస్వామ్య విరుద్ధమని నివేదికలో పేర్కొన్నారు. గురువారం సబ్ కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసి నివేదికను సమర్పించారు. ఎస్ఐఏ మినహాయింపు కోసం ఇచ్చిన జీవో 921లోని లోపాలు, గోదావరి జలాల మళ్లింపు వెనుక ఉన్న అశాస్త్రీయతను నిపుణులు మంత్రికి వివరించారు.