సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): వానాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలపై పడడం వంటివి ప్రతీయేడాది జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ముందస్తుగానే సన్నద్ధమవుతున్నది. సెక్షన్ల వారీగా రోలింగ్ స్టాక్‌ను సిద్ధం చేసుకుని జాగ్రత్త పడుతుంది. కానీ ఈసారి అధికారులు అలా చేయలేదు. ఇప్పటికీ వేసవి యాక్షన్ ప్లాన్లే చేస్తూ వానాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొవడానికి సిద్ధం కాకపోవడంతో నగరంలో రెండుసార్లు కురిసిన వర్షానికి విద్యుత్ పరంగా నగరవాసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండేళ్లలో కరెంట్ కోతలు పెరిగితే కాంగ్రెస్ హయాంలో గంటల తరబడి కరెంట్ కోతల నుంచి రోజుల తరబడి విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేని దుస్థితి వచ్చింది. నగరంలో ఈనెల 9, 12,13 తేదీల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా రోజుల తరబడి నిలిచిపోయింది. పునరుద్ధరణలో సిబ్బంది అలసత్వం కారణంగా ఆయా ప్రాంతాల వాసులు అంధకారంలోనే మగ్గిపోయారు. నష్టం తీవ్రతను అంచనా వేయడంలో కూడా సిబ్బంది సరిగా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. దీనిపై సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన కనబరచకపోగా.. విద్యుత్ పునరుద్ధరణ విషయంలో జాప్యానికి కారణాలపై కనీసం విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడంపై విద్యుత్ రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రోజుల తరబడి అంధకారంలోనే..!
రెండు దఫాలుగా కురిసిన వర్షాలతో కరెంట్ సరఫరా లేక చాలామంది నానా ఇబ్బందులు పడ్డారు. ఈనెల 9న కురిసిన వర్షానికి హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో తీవ్ర నష్టం జరిగి చాలాచోట్ల రెండురోజుల పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. మింట్‌కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కాలనీలు.. 24 గంటలకు పైగా కరెంట్ లేక నరకయాతన అనుభవించాయి.
విపత్తులు తలెత్తినప్పుడు అన్ని విభాగాలు కలిసి యుద్ధప్రాతిపదికన చేయాలిన పనులను హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లోని సైఫాబాద్, ఆజామాబాద్ డివిజన్లో విద్యుత్ సిబ్బంది సరఫరా పునరుద్ధరణలో ఆలస్యం కావడంతో వినియోగదారులు కరెంటు లేక నానాపాట్లు పడ్డారు. ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో జూన్ 9,12 తేదీల్లో ఈదురుగాలులు, భారీ వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గాంధీనగర్, హైట్రోన్ చర్చ్ వీధి, వై జంక్షన్, విద్యానగర్, ఎస్బీఐ బ్యాంక్ వీధి, సీపీఎం మార్క్స్ భవన్ కార్యాలయం వీధి, అడిక్‌మెట్ డివిజన్,ఆశీర్వాద్ అపార్ట్మెంట్ వీధి తదితర ప్రాంతాల్లో 24 గంటలు గడిచినా సరఫరా పునరుద్ధరించలేదు.
సమన్వయం లేకపోవడమే..!
విపత్తుల సమయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. కానీ గాలివానలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో డిస్కం పరంగా ఇవేవీ కనిపించలేదు. కూలిన భారీ చెట్లను తొలగించేందుకు సరైన యంత్రాలు డిస్కం వద్ద లేవు. ఒకవేళ అవసరమైతే సమీప డివిజన్లు, సర్కిళ్ల నుంచి సిబ్బందిని వినియోగించుకోవలసిన చోట తమ సిబ్బందితోనే అవసరమైనంత మేర పనిచేద్దామనుకున్న అధికారులు ఆ పనులు ముందుకు సాగక వినియోగదారులను ఇబ్బందులకు గురిచేశారు.
నగరంలోని పది సర్కిళ్లలో ఈ మూడు దఫాలుగా కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు కూలిన చెట్లు, పడిపోయిన స్తంభాల సంఖ్య వందల్లోనే ఉండగా వాటిని తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించడంలో ఎస్పీడీసీఎల్ యంత్రాంగం విఫలమైంది. మరోవైపు తీగలు లాగడం, స్తంభాలు వేసే పనులన్నీ సెక్షన్ కాంట్రాక్టర్లు లేబర్‌తో చేయిస్తుండగా ఆయా డివిజన్ల అధికారులు పనులను పర్యవేక్షిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో తగిన సిబ్బంది లేకపోవడంతో పాటు రోలింగ్ స్టాక్ కొరత కారణంగా ఈ విపత్తు సమయంలో పనులన్నీ ఆలస్యమయ్యాయని ఓ సీనియర్ ఇంజినీర్ తెలిపారు.
పనిచేయని హెల్ప్లైన్లు..
టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులకు విద్యుత్ హెల్ప్‌లైన్ నెంబర్ 1912. దక్షిణ డిస్కం పరిధిలోని వినియోగదారులు తమ ఫిర్యాదులను ఈ నెంబర్‌కు కాల్ చేసి చెబుతారు. స్కాడా ఆధ్వర్యంలో పనిచేసే ఈ హెల్ప్‌లైన్ కేంద్రంలో పరిమిత సంఖ్యలోనే సిబ్బంది ఉండడంతో గాలివానతో అంతరాయాలు ఏర్పడితే లైన్లు కలవడం లేదనే ఫిర్యాదులు వినియోగదారుల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. లైన్లు కలిసి ఫిర్యాదు చేసిన వినియోగదారుల అనుభవం మరోలా ఉంది. తమ ఫిర్యాదు పరిష్కారం కాకముందే పరిష్కారమైనట్లు మొబైల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయని పలువురు వినియోగదారులు చెబుతున్నారు.
గాలివానతో ఈనెల 9న విఠల్‌వాడీ, నారాయణగూడలో చెట్లు కూలి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మూడురోజుల పాటు కరెంట్ లేదు. ఫిర్యాదు చేసిన ప్రతీసారి మీ ఫిర్యాదు పరిష్కారమైందంటూ మెసేజ్ వచ్చింది. కానీ కరెంట్ మాత్రం రాలేదు. తమ సమస్య పరిష్కారం అయినట్లు యాప్‌లో చూపించడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి, జియాగూడ, శంషాబాద్ తదితర ప్రాంతాల వినియోగదారులు గంటల తరబడి సరఫరా లేక ఫిర్యాదు చేసే 1912 నెంబరు కలవక ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ల నెంబర్లు కూడా బిజీబిజీగా ఉంటున్నాయి. చాట్బాట్లోనూ స్పందన లేదని వినియోగదారులు చెప్పారు.
నేలకూలిన 326 చెట్లు..!
జూన్ 9,12,13 తేదీలలో నగరంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకూలిపోవడం జరిగింది. ఇందులో 9వ తేదీన 192 చోట్ల , 12న 80 ప్రాంతాల్లో, 13వ తేదీన 54చోట్ల చెట్లు పడ్డట్లు హైడ్రా బృందం తెలిపింది. ఇందులో దాదాపుగా అన్ని చెట్లు తొలగించామని వారు పేర్కొన్నారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిన ప్రాంతాల్లో ముఖ్యంగా స్తంభాలు నేలకూలి, వైర్లు తెగిపడిన చోట పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు డిస్కం సిబ్బంది తెలిపారు.
నేరుగా విద్యుత్ వైర్లు తాకవద్దు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లాల్‌బజార్ సెక్షన్పరిధిలోని టెలికాం కాలనీలో భారీ వృక్షం నేలకూలి అక్కడ పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఇదే సమయంలో స్ట్రీట్‌లైట్లకు సంబంధించి విద్యుత్ కేబుల్ కూడా తెగి చెట్టుకొమ్మలతో పాటు కారుపై పడిందని టీజీఎస్పీడీసీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కారణంగా తండ్రీకూతురు విద్యుత్ షాక్‌తో చనిపోయారని, విషయం తెలిసిన వెంటనే సంబంధిత ట్రాన్స్ఫార్మర్కు సరఫరాను నిలిపివేసి తదుపరి చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. విపత్తు సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ వైర్లు, కూలిన విద్యుత్ స్తంభాలు లేదా విద్యుత్ సంబంధిత ప్రమాదకర పరిస్థితులు కనిపించిన వెంటనే ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలపాలని ఆ ప్రకటనలో కోరింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు స్వయంగా విద్యుత్ వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలను ముట్టుకునేందుకు ప్రయత్నించవద్దని, మరమ్మతులు కూడా చేయకూడదని టీజీఎస్పీడీసీఎల్ సూచించింది.
వాక్ అలాంగ్ది లైన్ పేరుతో కార్యక్రమం
విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం లక్ష్యంగా ‘వాక్ అలాంగ్ ది లైన్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ ప్రకటించారు. మరోవైపు పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా వర్షాకాలంలో చెట్ల కారణంగా విద్యుత్ అంతరాయాలు కలగకుండా రెండు వారాల పాటు ప్రత్యేక ఫీడర్ మెయింటెనెన్స్, చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం సంస్థ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు, డీఈలు, ఇతర అధికారులతో సీఎండీ జితేశ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతీరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిగంటల వరకు సంస్థలోని అన్ని స్థాయిల ఉద్యోగులు క్షేత్రస్థాయిలో విద్యుత్ లైన్ల వెంట నడుస్తూ విద్యుత్ వ్యవస్థను పరిశీలించాలని చెప్పారు.
కోర్ అర్బన్ రీజయన్ ఎకానమీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో 33కేవీ సబ్స్టేషన్లు, 33కేవీ, 11కేవీ ఫీడర్లు, డీటీఆర్లు, ఎల్టీ నెట్‌వర్క్‌లను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని సీఎండీ ఆదేశించారు.కాగా, నగరంలోని పలు సర్కిళ్లలో సీఎండీ జితేశ్ వీ పాటిల్ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన సీఎండీ విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికారుల, సిబ్బంది హై అలర్ట్‌లో ఉండాలని ఆయన ఆదేశించారు. మరోవైపు ఎస్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శివాజీ శనివారం అర్ధరాత్రి మాదాపూర్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం జడ్చర్ల డివిజన్లోని కావరంపేట్ మోడల్ సబ్‌స్టేషన్‌ను శివాజీ పరిశీలించి సబ్‌స్టేషన్ పనితీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు.