వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు అరెస్టు
ఉప్పల్, జూన్ 8 : గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి 125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో చోటుచేసుకున్నది. ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో మల్కాజిగిరి డీపీఈఓ అరుణ్‌కుమార్, మల్కాజిగిరి ఏపీఅండ్ఈఎస్ ముకుంద్‌రెడ్డి, ఎస్హెచ్ఓలు చంద్రశేఖర్‌గౌడ్, మహేశ్వర్‌రెడ్డి, అబ్దుల్ జబ్బార్‌లు వివరాలను వెల్లడించారు. మల్లాపూర్ కేబుల్ చౌరస్తా ప్రాంతంలో గంజాయి తరలిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం మేరకు బుధవారం తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు మహరాష్ట్ర నుంచి వచ్చే ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు. గంజాయితో కూడిన ఓ కారు వేగంగా రావడం కనిపించింది. కారును నిలుపడానికి ప్రయత్నించగా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కారును నిలిపివేసి, తనిఖీ చేయగా 6 ప్లాస్టిక్ బ్యాగులలో 2.5 కేజీల 50 ప్యాకెట్లు గుర్తించారు. వారి నుంచి రూ.12 లక్షల విలువచేసే 125 కేజీల గంజాయి, 4 సెల్ఫోన్లు, రూ.92 వేల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన సిబా శంకర్ బేహరా(31), మహరాష్ట్ర పుణేకు చెందిన మధుకర్ వసంత చౌహన్(44), రోహిత్ కాంబ్లే(22), అమిత్ కాంబ్లే(24)లను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
కుత్బుల్లాపూర్‌లో…
దుండిగల్, జూన్ 8 : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలు దారుడిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్లకు చెందిన షేక్ఇబ్రహీం అలియాస్ సమీర్ (25)కు గంజాయి సేవించే అలవాటు ఉంది. సూరారం కాలనీకి చెందిన షబ్బీర్ (22) వద్ద ఇబ్రహీం గంజాయి కొనుగోలు చేస్తుంటాడు. ఇబ్రహీం ప్రస్తుతం బండ్లగూడలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని జ్యోతిరావు ఫూలే స్టేడియం వద్ద షబ్బీర్ గుట్టు చప్పుడు కాకుండా ఇబ్రహీంకు గంజాయి విక్రయిస్తుండగా అప్పటికే సమాచారం అందుకుని కాపుకాస్తున్న పోలీసులు ఇద్దరిని రెడ్‌హ్యాండేడ్‌గా పట్టుకున్నారు. షబ్బీర్ వద్ద నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీం, షబ్బీర్‌లను అరెస్ట్ చేసి రిమండ్‌కు తరలించారు.
బోరబండలో..
వెంగళరావునగర్, జూన్ 8 : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు.. బోరబండలోని లంబాడీ బస్తీలో నివాసముండే షేక్ మునవ్వర్ భాష(40) ఆటో డ్రైవర్. బుధవారం బోరబండలోని హైటెక్ హోటల్ వద్ద గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా ఉంచి భాషను పట్టుకున్నారు. అతడివద్దనుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు నిమిత్తం ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.