Missing Case | సిటీబ్యూరో: మిస్సింగ్ కేసుల పట్ల నగర పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసిన తరువాత అతని ఆచూకీ తెలిసిందా? ఎక్కడకు వెళ్లాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు చెప్పులు అరిగేలా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. మిస్సింగ్ అయిన వారి వయస్సును బట్టి ఒక అంచనాకు వచ్చి దర్యాప్తు జరుపుతుంటారు. అయినా కూడా వారి అంచనాలు తారుమారవుతూ సరైన సమయంలో స్పందించకపోవడంతోనే మిస్సింగ్ అయిన వారు శవాలుగా తేలడం వంటి ఘటనలు జరుగుతుంటాయి.
అయినా కూడా పోలీసుల్లో మార్పు రావడం లేదు. మిస్సింగ్ కేసు అంటేనే తేలికగా తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. దీనికి తోడు పోలీస్స్టేషన్ల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒకే పోలీస్‌స్టేషన్‌లో సెక్టార్ల వారీగా కూడా సమన్వయం లేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఠాణాలు, డివిజన్లు, జోన్లు, కమిషనరేట్ల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో అట్టే అర్ధమవుతున్నది. మిస్సింగ్ కేసుల్లో అన్ని కేసుల్లోనూ వేగంగా స్పందించాల్సిన అవసరముంటుంది. సెల్ ఫోన్లు, సీసీ కెమెరాలను బట్టే కేసును ఛేదించే పోలీసులు, ఈ విషయాలపై కూడా దృష్టి పెట్టకుండా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధిత కుటుంబసభ్యులను తిప్పి పంపిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.
15 రోజుల కిందట..
నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో 15 రోజుల కిందట ఒక వ్యక్తి మిస్సింగ్ అయ్యాడంటూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే మిస్సింగ్ అయిన వ్యక్తి గురించి అక్కడి పోలీసులు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా.. ఇంకా దొరకలేదనే సమాధానమే వస్తున్నది. మీ కేసు చూసే ఎస్సై లేడు.. 15 రోజులు పడుతుంది… చూద్దామంటూ పెద్దసార్లు సమాధానం.. ఇలా రద్దీగా ఉండే నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసులంటే చాలా లైట్‌గా తీసుకుంటున్నారు.
భార్య కనిపించడం లేదంటూ..
తన భార్య కన్పించడం లేదంటూ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, మరుసటి రోజు మాదాపూర్ పోలీస్‌స్టేసన్ పరిధిలో ఒక మహిళ మృతదేహం లభించిందని, 4న ఈ విషయం పంజాగుట్ట పోలీసులు గుర్తించారని ఇటీవల సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఓ జర్నలిస్ట్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోతే..
ఏడాది కిందట చాదర్‌ఘాట్ ఠాణాలో శ్రావణ్‌కుమార్ అనే యువకుడు కనిపించడం లేదంటూ అతడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే అదే యువకుడు అదే పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై.. మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని గుర్తుతెలియనిదిగా భావించి.. ఉస్మానియా మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులు కొడుకు ఫొటో పట్టుకొని 20 రోజుల పాటు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులపై నమ్మకం లేక తల్లిదండ్రులే నగరంలో తెలిసిన చోట వెతికారు. ఇలా తిరుగుతున్న క్రమంలోనే ఉస్మానియా మార్చురీకి కూడా వెళ్లి పరిశీలిస్తే.. కొడుకు మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కంగుతిన్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలొచ్చాయి.