సైదాబాద్, జనవరి 19 : మలక్‌పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, వ్యాపారుల, దళారీల ఇష్టారాజ్య దోపిడీ కారణంగా మిర్చి రైతుకు మద్దతు ధరలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మలక్‌పేట మార్కెట్‌కు ఈ సీజన్లో సుమారు వంద రోజుల పాటు మిరప క్రయ , విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 84,053 బస్తాల మిర్చి వస్తే, గత ఏడాది జనవరి 19 వరకు నాటికి 44,091 బస్తాలే వచ్చాయి.
శుక్రవారం రికార్డు స్థాయిలో 8,991 బస్తాలు వచ్చాయి. రోజుకు దాదాపు 4 వేల నుంచి 6 వేల వరకు మిర్చి బస్తాలు విక్రయానికి వస్తున్నాయి. గత ఏడాది నాణ్యమైన తేజరకం మిర్చి క్వింటా ధర 23 వేలు ఉండగా, కనిష్ట ధర రూ. 14వేలు పలికింది. ప్రస్తుతం మిర్చి క్వింటా ధర గరిష్టంగా రూ. 20 వేలు పలుకగా, కనిష్ట ధర రూ. 4వేలు మాత్రమే పలికింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో వ్యాపారులు చేతితో మిర్చి నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయిస్తున్నారు.
మార్కెట్లలో వ్యాపారుల, దళారీ వ్యవస్థలను రూపుమాపడానికి కేసీఆర్ ప్రభుత్వం తేమ శాతం నిర్ధారించడానికి ఆధునిక యాంత్రాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, జీపీఆర్ఎస్ కాంటాలు, క్రయ, విక్రయాల్లో ఈ-నామ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ వ్యాపారులు యంత్రాలను వినియోగించకుండా పాత మూస పద్ధతులనే అవలంభిస్తూ మిర్చి రైతులకు శఠగోపం పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
గత ఏడాది కంటే మిర్చి దిగుబడి పెరగటంతో ధరలు తక్కువ ఉన్న మాట వాస్తవమే. తేమ నిర్ధారణ యంత్రం అందుబాటులోనే ఉంది. రైతులే నేరుగా వినియోగించుకోవచ్చు. రైతులు తమకు నచ్చిన ధరలకే విక్రయించాలని, లేకుంటే సరుకు తీసుకెళ్లి మంచి ధర ఉన్నప్పుడే విక్రయించే విధంగా ప్రతి రోజు మైక్‌ల ద్వారా జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నాం.
– దామోదర్,మలక్‌పేట మార్కెట్ సెకండరీ గ్రేడ్ అధికారి.
ఎంతో కష్టపడి పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లభించటంలేదు. సరుకు ఎక్కువగా వచ్చిందని వ్యాపారులు ధరలు పెట్టడంలేదు. ఎన్నో ఇబ్బందులు పడి తెచ్చిన పంటను వెనక్కు తీసుకెళ్లలేక.. గతి లేక అమ్ముకొని వెళ్లి పోతున్నాం.
– శేషన్న , రైతు, కొండపల్లి, జోగులాంబ గద్వాల జిల్లా