సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ), మొయినాబాద్, జనవరి 5 : ‘కూలీ నాలీ చేసి పైసా పైసా పోగు చేసి.. ఊర్లో భూములు అమ్ముకొని.. ప్లాట్లు కొనుగోలు చేసి.. గూడు కట్టుకుంటే రియల్ వ్యాపారుల కన్ను పడిందని.. ముఖ్యమంత్రి సోదరుల అండదండలతో రియల్ వ్యాపారులు గుండాలతో వచ్చి నిద్రలో ఉన్న మమ్మల్నీ లేపి తెల్లవారుజామున ఇండ్లు కూల్చివేశారని గిరిజనులు కన్నీరు మున్నీరయ్యారు. మహిళలు, గర్భిణులు, వృద్ధులు, పసి పిల్లలు అని చూడకుండా ఇంట్లో సామగ్రిని రోడ్డు మీద పడేశారని, గిరిజనులని చూడకుండా గెంటేసి కూల్చివేసి తమ బతుకులను రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు అని చూడకుండా మహిళా పోలీసులు పొట్ట మీద తన్ని.. ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లి రోడ్డు మీద పడేసి ఇండ్లు కూలగొట్టినట్లు చెప్పారు.
మొయినాబాద్‌లోని పెద్ద మంగళారంలో గిరిజనుల ఇండ్లు కూల్చివేయడంతో కాంగ్రెస్ సర్కారుపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. తెల్లవారు జామున కాలనీలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ..సీసీ కెమెరాలను పగుల గొట్టి అక్రమంగా ఇండ్లు కట్టుకున్నారని.. దౌర్జన్యం చేసి జేసీబీలతో కూల్చివేశారని గిరిజన బాధితులు ఆరోపిస్తున్నారు. ఇండ్లను ఖాళీ చేయకుంటే చంపేస్తామని.. కులం పేరుతో దూషించి తీవ్ర భయబ్రాంతులకు గురి చేసినట్లు చెప్పారు. కూల్చివేతల వెనకాల ముఖ్యమంత్రి సోదరుడు తిరిపతిరెడ్డి పేరు వినిపిస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని, సీఎం ఇలా చేస్తారని అనుకోలేదని బాధితులు అంటున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో 210, 211, 212 సర్వే నంబర్లలో రాఘవేంద్ర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1986లో 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంచర్ చేశారు. అప్పటి నుంచి వినియోగదారులు 2023 వరకు కూడా ప్లాట్లు కొనుగోలు చేస్తూ వచ్చారు. అయితే పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 50 గిరిజన కుటుంబాలు తమ సొంత గ్రామాల్లో తనకు ఉన్న భూములను అమ్ముకొని నాలుగేండ్ల నుంచి రాఘవేంద్ర కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేస్తూ వచ్చారు.
గిరిజనులు గ్రామాల్లో సర్వం కోల్పోవడంతో కొనుగోలు చేసి ప్లాట్లల్లో ఇండ్లు కట్టుకుని ఇక్కడే నివాసం ఉండటానికి కొందరు తమ స్థోమత తగినట్లుగా 10 మంది కుటుంబాల వరకు ఇండ్లు కట్టుకున్నారు. కొందరు తమ ప్లాట్లకు ఫ్రీ కాస్టులు వేసి గుడిసెలు వేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నారు. కూలీనాలీ చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. అయితే గిరిజనులు ఇండ్లు, పాట్ల మీద రియల్ వ్యాపారుల కన్ను పడింది. శ్రీనివాసురాజు, సురేశ్‌రెడ్డి 1998లో రాఘవేంద్ర కో ఆపరేటివ్ సొసైటీ నుంచి అగ్రిమెంట్ చేసుకుని కోర్టు ద్వారా 2011లో డిక్రీ తీసుకుని కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నామని.. ప్లాట్లు ఉన్న భూమి వారు గిరిజనులను కొంత కాలం గా భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చా రు.
ప్లాట్లు వదిలి పెట్టి వెళ్లాలని అనేక సార్లు శ్రీనివాస్‌రాజు, సురేశ్‌రెడ్డితో పాటు శ్రీనివాస్‌గౌడ్, రాజుగౌడ్ అనే వ్యక్తులు తమను బెదిరించారని బాధితులు ఆరోపించారు. ఇండ్లు ఖాళీ చేయడం లేదని రియల్ వ్యాపారులు జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని హై కోర్టు ను ఆశ్రయంచి కూల్చివేతలకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. రియల్ వ్యాపారులు మున్సిపల్ అధికారులు పోలీసు బలగాలతో గత నెల 30న తెల్లవారు జాము న 4 గంటలకు ఇండ్ల మీదకి జేసీబీలతో వెళ్లారు. ఇంట్లో నిద్రపోతుండగా నిద్ర నుంచి లేపి ఇండ్లో సామగ్రిని రోడ్డు మీద పడేసి పడుకున్న వృద్ధులు, పసిపిల్లలు, గర్భిణులను ఇంట్లో నుంచి గెంటేసి గుండాలతో బెదిరించి ఇండ్లు కూల్చి వేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల వెనకాల ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఉన్నాడని బాధితులు ఆరోపించారు. ‘మా ఇండ్లు కూల్చివేసి ప్లాట్లు తీసుకోవడానికి ముఖ్యమంత్రి సోదరుడు తిరిపతిరెడ్డికి ఎలా మనసు వచ్చింద’ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామన్నారు.
ఇంట్లో పడుకునప్పుడు గూండాలు వచ్చి ఇండ్లు కూల్చి వేశారు. పిల్లల స్కూల్ ఫీజు కట్టుడానికి మా అత్తామామల వద్ద ఉన్న వెండి అమ్మేసి డబ్బులు ఇచ్చారు. డబ్బులు, మా ఆయన బంగారం ఉంగరం ఇంట్లోనే ఉంది. ఇల్లు కూల్చివేయడంతో అందులోనే ఉండిపోయాయి. బియ్యం బస్తాలో అందులోనే ఉన్నాయి. తినడానికి తిండి లేదు.అధికారం ఉందని ఏమైనా చేస్తారు. పేదల ఆస్తులు కదా వాళ్లది ఏమి పోతుంది. రేవంత్‌రెడ్డికి ఓట్లు వేసి చాలా తప్పు చేశాం. ఇంత జరుగుతున్నా.. ముఖ్యమంత్రికి తెలియలేదా.టీవీలలో వస్తుంది కదా. చూసీ కూడా స్పందిస్తలేరంటే కావాలనే కూల్చారు. ఎస్టీలు అంటే సీఎం రేవంత్‌రెడ్డికి చాలా చిన్న చూపు. కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి చేస్తాదని ఓటు వేశాం…కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశాం.
తిరుపతిరెడ్డి అనేటాయనకు బుద్ధి లేదా.. సి గ్గు లేదా…కడుపుకు అ న్నం తింటలేదా. ఆయ న పేరు బాగా వినిపిస్తుం ది. గవర్నమెంటు ల్యాం డ్ అయితే అధికారులు వచ్చి కూల్చివేస్తారు క దా. బౌన్సర్లు వచ్చి కూల్చివేయాల్సిన పని ఎందుకు. కార్లు నడుపుకొని బతుకుతున్నాం. ఓట్లకు మాత్రం లంబాడోళ్లు కావాలా..? తిరుపతిరెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుంది.