సిటీబ్యూరో, మార్చ్28(నమస్తే తెలంగాణ) : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గుల సమస్యలు వెంటనే గుర్తించేందుకు వీలుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే అధిక ఒత్తిడికి గురవుతున్న డిస్టిబ్య్రూషన్ ట్రాన్స్ఫార్మర్లు, దెబ్బతిన్న ఇన్సులేటర్లు, ఫ్యూజ్బాక్సులు, శిథిలావస్తకు చేరిన స్థంభాలు, లూజ్లైన్లను గుర్తించి వాటిని సాసా వెబ్‌పోర్టల్‌లో డిస్కం పొందుపరిచింది. తాజాగా 11కేవీ ఫీడర్ల మానిటరింగ్ కోసం ఫీడర్ ఔటర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నది. దీని ద్వారా ఏ ఫీడర్పై ఎంత మేరకు ఒత్తిడి ఉంది? ఏరోజు ఎన్ని నిముషాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది? ఎంత సమయంలో సరఫరా పునరుద్ధరించారనే సమాచారం నిక్షిప్తమవుతుంది. డిస్కం కేంద్రకార్యాలయంలోని ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయిలోని ఏఈల మొబైల్ఫోన్లకు సమాచారం వస్తుంది. దీంతో లైన్ల నిర్వహణ, పునరుద్దరణ పేరుతో క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు అడ్డగోలుగా అమలు చేస్తున్న ఎల్సిలకు చెక్ పడుతుందని డిస్కం ఉన్నతాధికారులు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 11కేవీ ఫీడర్లు 3412వరకు ఉన్నాయి. ఒక్కో ఫీడర్ కొన్ని కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది. ఫీడర్పై 25 నుంచి 50 వరకు డిస్టిబ్య్రూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఒక్కో డిటిఆర్ పరిధిలో 50 విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. గృహయజమానులు విద్యుత్ యజమానులు కనెక్షన్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక కిలోవాట్, రెండు కిలోవాట్లకు పరిమితమవుతుంటారు. ఆతర్వాత విద్యుత్ ఉపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేయడంతో సామర్థ్యానికి మించి భారం పడుతోంది. దీంతో దగ్గరలో ఉన్న డీటీఆర్, సబ్స్టేషన్లలోని ఫీడర్లపై ఈ భారం పడుతున్నది. ఉష్ణోగ్రతలు పెరుగుతూ, అధిక విద్యుత్ వినియోగం కావడంతో ఫీడర్లపై భారం పడి ట్రిప్ అవుతున్నది. దీంతో ఈ పరిస్థితిని అంచనా వేయడానికి కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. తొలిదశలో జీహెచ్ఎంసీ పరిధిలో 2వేల ఫీడర్లకు ఈ టెక్నాలజీని ప్రయోగించాలని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ మొదటివారంలో ఫీడర్ ఔటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి తెస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.