Old City Metro | సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ అపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదు. నాలుగు నెలల కిందట రెవెన్యూ, మెట్రో కలిసి భూసేకరణకు కసరత్తు ప్రారంభించినా… ఇప్పటి వరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. మతపరమైన, చారిత్రక కట్టడాల ప్రాంతాల్లో ఎదురవుతున్న ఇబ్బందులతో వేగంగా జరగాల్సిన భూసేకరణకు అడ్డంకులు వస్తున్నాయి. దీంతో భూములు సేకరిస్తే తప్ప.. ప్రాజెక్టును నిర్మించే వీలు లేకుండా పోయింది. ఆస్తులు సేకరించిన ప్రాంతంలో కూల్చివేతలు మొదలుపెట్టినా.. న్యాయపరమైన చిక్కులు మెట్రోను వెనక్కి లాగుతూనే ఉన్నాయి.
7.5 కిలోమీటర్ల మేర..
7.5కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించిన దాదాపు రూ. 2740 కోట్లతో నిర్మించనున్న మెట్రో కారిడార్‌కు నాలుగు నెలల కిందటే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. నిర్ణీత గడువులోగా భూసేకరణ పూర్తి చేసేలా ముందస్తుగానే ఆస్తులను గుర్తించినా.. పరిహారం, న్యాయపరమైన అభ్యంతరాలు ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయి. ఓ వైపు మతపరమైన, చారిత్రక కట్టడాలు ఉండే ఈ ప్రాంతంలో భూసేకరణ పూర్తి అయితే తప్ప.. ప్రాజెక్టు ముందుకెళ్లే పరిస్థితి లేదు.
వెయ్యికిపైగా ఆస్తులు ప్రభావితం
ఎంబీబీఎస్ నుంచి చాంద్రాయాణగుట్ట వరకు నిర్మించే మెట్రో మార్గం హైదరాబాద్ మెట్రో విస్తరణలో అత్యంత కీలకమైనది. మొదటి దశలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో భూసేకరణ ఇబ్బందులు, కోర్టు వివాదాలు ప్రాజెక్టు పనులకు అడ్డుపడ్డాయి. దీంతో అప్పటి నుంచి ప్రతిపాదనలు, కాగితాలకే ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పరిమితమైంది.
అయితే ఇటీవల ఓల్డ్ సిటీ మెట్రో జాప్యంపై తీవ్ర విమర్శలు రావడంతో అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీ మెట్రోను చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి కొత్తగా కార్యాచరణ అమలు చేసింది. రూ.2741 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్-2 విస్తరణలో భాగంగా చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1000కిపైగా ఆస్తులు ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు. ఇందులో మెట్రోకు అంగీకారం తెలిపిన వారి సంఖ్య వంద లోపే ఉంది. గడిచిన నాలుగు నెలలుగా 200లోపే ఆస్తులను సేకరించారు. భూ యాజమాన్య హక్కుల పరిశీలన తర్వాత చెక్కులను పంపిణీ చేస్తున్నా.. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తేనే నిర్మాణ పనులు మొదలవుతాయి. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులతో భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతూనే ఉంది.
ఫేజ్-2పై ఆందోళన అక్కర్లేదు
మెట్రో ఫేజ్-2 పార్ట్-బీ లో కీలకమైన నార్త్ సిటీ మెట్రో విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్ట్-బీగా ప్రతిపాదించిన ఈ ప్రాంతానికి మెట్రో నిర్మించేందుకు అవసరమైన డీపీఆర్‌ను ఇప్పటికే పూర్తి చేశామని, ప్రభుత్వ ఆమోదం తర్వాత వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మెట్రో విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలు గడిచినా డీపీఆర్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ బోర్డు ఈనెల 8న డీపీఆర్‌ను ఆమోదించిందని సంబంధిత డీపీఆర్ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, ప్రభుత్వం ఆమోదం తెలిపేంత వరకు కొన్ని అంశాల విషయంలో గోప్యత పాటిస్తున్నామన్నారు. జేబీఎస్‌ను మెట్రో హబ్‌గా తీర్చిదిద్దుతూ.. పలు అంశాలను డీపీఆర్‌లో పొందుపరిచామని, రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో 86.1కి.మీ పొడువు గల జేబీఎస్- మేడ్చల్, జేబీఎస్- శామీర్‌పేట, ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్ సిటీ మెట్రో ఫేజ్-2 పార్ట్ బీ కారిడార్ల ప్రతిపాదనలతో డీపీఆర్ పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఇతర రాష్ర్టాల్లో మెట్రో రైల్ నిర్మాణ అంచనాలు, సిటీ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెండో దశ డీపీఆర్‌ల రూపకల్పన సమగ్రంగా జరిగిందన్నారు.
నార్త్ సిటీలో 32 మెట్రో స్టేషన్లు..
జేబీఎస్ నుంచి మేడ్చల్ మార్గంలో నిర్మించనున్న మెట్రో మార్గంలో మొత్తం 32 స్టేషన్లను ప్రతిపాదించినట్లుగా తెలిపారు. ఈ మార్గంలో 24.5 కిలోమీటర్ల పొడువునా 18 మెట్రో స్టేషన్లు పూర్తి ఎలివేటెడ్ కారిడార్‌గా ఉంటుందని, అలాగే జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరుకు 22 కిలోమీటర్ల కారిడార్‌లో 14 స్టేషన్లతో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదేవిధంగా 39.6 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్ సిటీ కారిడార్‌లో 1.5 కిలోమీటర్లు భూగర్భ మార్గం గాను, 21 కిలోమీటర్లు 21 ఎలివేటెడ్, 17 కిలోమీటర్లు ఎట్ గ్రేడ్ విధానంలో నిర్మించేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.