సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతంలోని కొహెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు పసుల నర్సమ్మ(65) స్వగృహం కాలనీలోని తన మూడో కుమారుడు శ్రీశైలం ఇంటి నుంచి సమీపంలోని రెండో కుమారుడు యాదగిరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నది. ఈ క్రమంలోనే బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇబ్రహీంపట్నంకు ఎట్లా పోవాలంటూ ఆమెను బాట అడిగారు.. ఇలా వెళ్లండంటూ ఆమె బాట చూపిస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లతాడును లాక్కొని పరారయ్యారు.. అది నిర్జన ప్రదేశం కావడం.. ఎవరు లేకపోవడంతో స్నాచర్లు ఈజీగా అక్కడి నుంచి తప్పించుకుపోయారు.. పట్టణ ప్రాంతంలో పోలీసుల నిఘా పెరగడంతో ఇప్పుడు స్నాచర్లు శివారు ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు.
అయినా నగరంతో పాటు నగరం బయట చైన్ స్నాచర్లు హాల్చల్ చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో గతంలో స్నాచింగ్ ఘటనలు అత్యంత అరుదుగా జరిగేవి. నేడు తరచూ జరుగుతున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చైన్ స్నాచర్లు విజృంభిస్తున్నారు. పోలీసులు చాలా కేసుల్లో పట్టుకుంటూ స్నాచర్లను జైల్లోకి పంపిస్తున్నా, కొత్త కొత్త ముఠాలు స్నాచర్ల అవతరామెత్తుతున్నారు. ఒక్క తులం కొడితే లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయి.. వ్యాపారాలు సరిగ్గా లేకపోవడం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు స్తబ్దుగా ఉండడంతో ఆయా రంగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే వారికి ఆదాయ వనరులు తగ్గుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు స్నాచింగ్‌లు, దొంగతనాల బాట పడుతున్నారు. శివార్లలోని నిర్జన ప్రదేశాల్లో సీసీ కెమెరాల నిఘా ఉండదనే ధీమాతో కొన్ని ముఠాలు ఆయా ప్రాంతాల్లో స్నాచింగ్‌లకు తెగబడుతున్నాయి. రాచకొండ, సైబరాబాద్ పరిధిలో చాలా వరకు గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఈ స్నాచింగ్‌లు అనేవి ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలియదు. అలాంటిది స్వేచ్ఛగా తిరుగుతుంటారు. కాగా స్నాచర్లు అలాంటి గ్రామీణ ప్రాంతాలపై పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ పెట్రోలింగ్‌ను గ్రామీణ ప్రాంతాల్లోనూ విరివిగా తిరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.