Cyber Crime | సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉంటూ స్వదేశీ బ్యాంకు ఖాతాలను వాడుతున్న సైబర్ నేరగాళ్లకు కొంత మంది బ్యాంకు అధికారులు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారుల పాత్రపై నిగ్గుతేల్చి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందిన పలు బ్యాంకు అధికారులపై సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. వంద బ్యాంకు ఖాతాల్లో 30శాతం వరకు గుజరాత్ రాష్ట్రంలోనే సైబర్‌నేరగాళ్లు తెరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలు తెరిచేందుకు ఏజెంట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తుండటంతో సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు అనువైన ప్రాంతంలో ఎంచుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకప్పడు లక్షల్లో ఉన్న సైబర్‌మోసాలు నేడు కోట్లలోకి వెళ్లాయి. ఇందులో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాల్లో అధిక లాభాలొస్తాయనే ఆశలో కొందరు ఈజీగా మోసపోతుండగా, డిజిటల్ అరెస్ట్‌ల భయంతో మరికొందరు కోట్లు పోగొట్టుకుంటున్నారు. అయితే సైబర్‌నేరగాళ్లు బాధితుల నుంచి దోపిడీ చేస్తున్న సొమ్మంతా బ్యాంకు ఖాతాల నుంచే వెళ్తున్నది. ఇక్కడే బ్యాంకు అధికారులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.
సామాన్య పౌరులు బ్యాంకుకు వెళ్లి ఒక కంపెనీ, ఫార్మ్పై ఖాతా తెరువాలంటే అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి, కార్యాలయాన్ని కూడా పరిశీలించిన తరువాతే బ్యాంకు ఖాతా తెరుస్తారు. దాంతోపాటు ఆయా ఖాతాల్లో నెలవారీగా ఎంత లావాదేవీలు జరుగుతాయని అడుగుతారు. ఇలా అన్ని విషయాలు పరిశీలించిన తరువాతే కరెంట్ ఖాతా ఇస్తారు. అయితే సైబర్‌నేరగాళ్లు తెరుస్తున్న ఖాతాల్లో ఎలాంటి కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, అడ్రస్ ప్రూప్స్ లేకుండానే బ్యాంకు ఖాతాలు తెరుచుకుంటున్నాయి. అడ్రస్ లేని కంపెనీల ఖాతాల్లో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. దాంతో పాటు కొన్ని ఖాతాల్లో ప్రతిరోజు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా నగదు డ్రా చేసుకున్న ఘటనలున్నాయి. ఆన్లైన్లో కోట్ల రూపాయలు, లక్షల రూపాయల నగదు డ్రా చేస్తున్నా బ్యాంకు అధికారులు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. రూ.2లక్షల కంటే ఎక్కువగా నగదు ఇవ్వాలంటే ఎన్నో కొర్రిలు పెట్టే బ్యాంకు అధికారులు కొందరికి మాత్రం ఎందుకు మినహాయింపు ఇస్తారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో జరిగిన ఆర్ధిక లావాదేవీలను పరిశీలించారు. 100 బ్యాంకు ఖాతాలు ఉన్నాయంటే అందులో 30 బ్యాంకు ఖాతాలు గుజరాత్ రాష్ట్రంలో, మరో 20 రాజస్థాన్‌లో ఉంటున్నాయి. మిగతా 50 ఇతర రాష్ర్టాల్లో ఉంటున్నాయి. ప్రైవేట్ బ్యాంకులతోపాటు జాతీయ బ్యాంకుల్లో కొందరు అధికారులు సైతం సైబర్‌నేరగాళ్లకు సహకరిస్తున్నారు.
కండ్ల ముందు అమాయకుల నుంచి సైబర్‌నేరగాళ్లు కోట్లు దోచేస్తున్నా, విషయం తెలిసి కూడా మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరించడంతోపాటు ఆయా బ్యాంకు ఖాతాల్లో ఇష్టానుసారంగా లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం కల్పించే అధికారులను గుర్తించి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాంకు ఖాతాలను సైబర్‌నేరగాళ్లు వినియోగంచడాన్ని అడ్డుకోగలిగితే భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా సైబర్నేరాలను తగ్గించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాంకు అధికారుల పాత్రను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోనేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈనెల 9న సీఎం రేవంత్‌రెడ్డిని కలవనున్నారు. నగరంలో చెరువులు, ఆక్రమణలు ప్రస్తుతం పరిస్థితులపై సీఎంతో చర్చించనున్నారని తెలిసింది. ఈమేరకు ఇప్పటివరకు హైడ్రా చేసిన పనులు, తమ వద్దకు వస్తున్న ఫిర్యాదులు, తాము తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా నివేదిక తయారు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో శాసనసభలో హైడ్రాపై చర్చ జరిగే అవకాశమున్నందున పూర్తి రిపోర్ట్‌తో సీఎంను రంగనాథ్ కలవనున్నారు.