పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం నుంచి ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల నుంచి సుందరీమణులు నగరానికి చేరుకోగా, వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. పోటీలు జరిగే స్టేడియం చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. అందాల భామలు బస చేస్తున్న హోటళ్లు వద్ద కూడా భద్రతను పెంచారు. ప్రపంచ అందాల పోటీలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడం కలకలం సృష్టించింది. అది ఉత్తిదే అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఓ విద్యార్థిని ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా ఇన్‌స్టాలో పోస్టుపెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వైద్య, ఆరోగ్య శాఖ సైతం అప్రమత్తమైంది. గ్రేటర్ పరిధిలోని పలు సర్కారు దవాఖానలపై దాడులు జరగకుండా వాటిపై రెడ్ క్రాస్ గుర్తులను పెయింటింగ్ వేయించింది.
సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యగా 100 లేదా అంతకంటే ఎక్కువ పడకల సామర్థ్యం ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల పైకప్పులపై ఎరుపు రంగుతో ప్లస్ గుర్తు స్పష్టంగా కనిపించేలా పెయింట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 వైద్యశాలల్లో ఈ ప్రక్రియ చేపట్టినట్లు డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లా పరిధిలో 9, మేడ్చల్ పరిధిలో ఉన్న మొత్తం దవాఖానల పైకప్పులపై ‘రెడ్‌క్రాస్ మార్క్’ వేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరిగినప్పుడు జనివా 1949 ఒప్పందం ప్రకారం.. హాస్పిటల్స్, వైద్యసిబ్బంది, రోగులపై దాడులు చేయడం నిషేధం. అందుకని యుద్ధాలు జరిగే సమయంలో హాస్పిటళ్లను సులభంగా గుర్తించేందుకు వాటి పై కప్పులపై స్పష్టంగా కనిపించేలా ఎరుపు రంగుతో ప్లస్ గుర్తును ఏర్పాటు చేస్తారు. దీని వల్ల దాడులు చేసే వారు ఆ గుర్తు ఉన్న భవనాల జోలికి వెళ్లరు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల స్లాబ్‌లపై 12*12 పరిమాణంలో ఎరుపు రంగుతో కూడిన ప్లస్ గుర్తు వేశారు. ఇది ఎంత దూరం నుంచి అయినా స్పష్టంగా కనిపించడం వల్ల దాడుల నుంచి దవాఖానలకు రక్షణ కల్పించే అవకాశముంటుంది.
సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా ఇస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ విద్యార్థినిపై కేసు నమోదైంది. చంపాపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్టు పెడుతూ..
జాతీయ జెండాను అవమానిస్తూ పోస్టు చేసింది. వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకున్నది. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో ఐఎస్ సదన్ పోలీసులు బీఎన్ఎస్ 196, 353(2) సెక్షన్ల కింద విద్యార్థినిపై కేసు నమోదు చేశారు.
కరాచీ బేకరీ ఇండియా బ్రాండ్ అని.. పాకిస్థాన్‌ది కాదని కరాచీ బేకరీ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కరాచీ పేరు పెట్టుకున్నందుకు పాకిస్తాన్‌కు చెందిన పేరని, ఆ పేరు మార్చాలంటూ చాలా మంది బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేరు మార్చకుండా న్యాయం చేయాలంటూ నిర్వాహకులు రాజేశ్, హరీశ్ రామ్నాని సీఎం, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. ‘మా తాత 1953లో హైదరాబాదీలో కరాచీ బేకరీని స్థాపించారు. మేము 72 ఏండ్లుగా నగరంలో నివసిస్తున్నాం.
1947లో దేశ విభజన సమయంలో మా తాత పాకిస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు’ అని తెలిపారు. పాకిస్థాన్ ఘర్షణలు జరుగుతున్న ప్రతీ సారి తమ కరాచీ బేకరీపై దాడులకు యత్నిస్తున్నారన్నారు. హైదరాబాద్, వైజాగ్‌లోని తమ కరాచీ బేకరీలపై ఎటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. తాము భారతీయులమని.. కరాచీ పేరుతో తమను అవమానించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, పహల్గాం ఘటన జరిగిన తర్వాత చాలా మంది నిరసనకారులు కరాచీ బేకరీపై దాడికి యత్నించారు. కరాచీ పేరు బోర్డును తొలిగించే ప్రయత్నం చేశారు. బేకరీపై త్రివర్ణ జెండా ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో యాజమాన్యం తమకు రక్షణ కల్పించాలంటూ కోరింది.