Hyderabad | వెంగళరావునగర్, మార్చి 12 : కంచే చేను మేసిన చందంగా ఉంది ఓ బ్యాంక్ అధికారి తీరు. ఖాతాలో డబ్బు జమ చేయాలని డబ్బిస్తే.. జేబులో వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు బ్యాంక్ క్యాషియర్. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా మధురానగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం అమీర్‌పేట్‌లోని సౌత్ ఇండియా బ్యాంక్ లిమిటెడ్‌లో డబ్బు జమ చేసేందుకు ఖాతాదారుడు వల్లభనేని హరీష్ బాబు రూ.50 వేలు డబ్బుతో పాటు పే స్లిప్ ఇచ్చారు. తన అకౌంట్‌కు రూ. 25,000 జమ చేయాలని క్యాషియర్‌కు సూచించారు. అందులో రూ.25 వేలు మాత్రమే అకౌంట్లో జమ చేసి సగం డబ్బు రూ. 25 వేలను క్యాషియర్ తన జేబులో వేసుకున్నాడు. తన అకౌంట్లో డబ్బు జమ కాకపోవడంతో ఖాతాదారుడు హరీష్ బ్యాంక్ మేనేజర్ మితున్ పచేరి మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అంతర్గత విచారణ చేపట్టారు. బ్యాంకు సీసీటీవీ కెమెరాల్లో క్యాషియర్ డబ్బు జేబులో వేసుకున్నట్లు ఆధారాలు దొరికాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాషియర్ రూ. 25 వేలు కాజేసి తన జేబులో వేసుకోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ ఉందని ఫిర్యాదు చేయడంతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.