KBR Park | సిటీబ్యూరో, సెప్టెంబరు 12(నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు గాను పార్కు ఎంట్రీ గేట్ వన్ వద్ద మల్టీ లెవల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు మల్టీ లెవల్ కారు పార్కింగ్ కేంద్ర నిర్మాణం, 10 ఏండ్ల ఎక్కువకు బిడ్డర్ అయిన నవ నిర్మాణ్ అసోసియేషన్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చేందుకు గాను రాటిఫికేషన్‌కు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రికమండ్ చేస్తూ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
వీటితో పాటు వివిధ వాట్స్లలో 15,500 కొత్త ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు కొనుగోలు చేసేందుకు రూ.2.98 కోట్లకు పరిపాలన అనుమతితో షార్ట్ టెండర్ పిలిచేందుకు కమిటీ ఆమోదించింది. సీఎస్ఆర్ పద్ధతిలో చెరువుల అభివృద్ధికి, చెరువులలో దోమల నివారణకు డ్రోన్ల ద్వారా స్ప్రే చేసేందుకు ముందుకు వచ్చే వారిని గుర్తించాలని మేయర్ అధికారులకు సూచించారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన 5వ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సమావేశంలో 14 అంశాలకు సభ్యులు ఆమోదించినట్లు ఆమె తెలిపారు.
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 90 మంది కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు/ కమ్యూనిటీ ఆర్గనైజర్ల పే స్కేల్‌ను ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ పెంపు ప్రతిపాదనలను కమిటీ ఆమోదించింది. బండ్లగూడ జంక్షన్ నుంచి ఎర్రకుంట జంక్షన్ వరకు 100 అడుగుల రహదారి విస్తరణ అభివృద్ధికి ఎస్ఆర్డీపీ కింద రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టే రోడ్డుకి 44 ఆస్తుల సేకరణ, షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.14లో యాక్సెస్ రోడ్డు కేటాయింపునకు హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ టి.సురేఖ, ఏ.విజయలక్ష్మిలకు చెందిన ప్లాట్లకు 70.04 చదరపు గజాల స్థలానికి మార్కెట్ విలువ చదరపు గజానికి ఒక లక్ష రూపాయల చొప్పున చెల్లింపుపై ఎన్వోసీ జారీ చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది.
హఫీజ్‌పేటలోని కైదమ్మ కుంటను సీఎస్ఆర్ కింద పునరుద్ధరించుటకు మల్లిగావద్ ఫౌండేషన్ వారితో ఆరు నెలల కాలానికి ఎంఓయూ, సికింద్రాబాద్ – సీతాఫల్మండి రైల్వేస్టేషన్ల మధ్య బాక్స్ ఫుషింగ్ పద్ధతిలో కొత్త వంతెన నిర్మాణానికి రూ.19.74 కోట్లకు పరిపాలన అనుమతులు, లోతు కుంట రైల్వే బ్రిడ్జి నుంచి అల్వాల్ ఆర్వోబీ తెలుగు తల్లి విగ్రహం వద్ద జీహెచ్ఎంసీ పరిధి వరకు 60 మీటర్ల ప్రతిపాదిత రోడ్డు వెడల్పునకు ప్రభావితమయ్యే 107 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదించింది.
మజీద్ బండ కుడి కుంట నాలాకు రూ.3.96 కోట్ల అంచనా వ్యయంతో వరద నీటి కాలు పనులకు షార్ట్ టెండర్, చందానగర్ సర్కిల్లో కేఎస్సార్ లే అవుట్ వద్ద సీఎస్ఆర్ కింద 43,600 చదరపు అడుగులలో అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధికి మేసర్స్ తువక్కం వెల్ఫేర్ అసోసియేషన్‌తో మూడేండ్ల కాలానికి జోనల్ కమిషనర్ ఎంఓయూ, శేరి లింగంపల్లి జోన్లో సీఎస్ఆర్ కింద ఐదు చోట్ల ఇంజక్షన్ బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణానికి గాను మేసర్స్ వాటర్ ఎయిడ్ ఆర్గనైజేషన్‌తో జోనల్ కమిషనర్ ఎంఓయూ కుదుర్చుకునేందుకు అనుమతి ఇచ్చింది.
గోపన్‌పల్లిలో 500 గజాల స్థలంలో పెంపుడు జంతువుల స్మశాన వాటిక నిర్మాణం, మూడేండ్ల పాటు నిర్వహణను తమ సొంత నిధులతో మేసర్స్ రాగ ఫౌండేషన్ వారితో జోనల్ కమిషనర్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు అనుమతి ఇస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కమిషనర్ ఆమ్రపాలి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అదనపు కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరి రావు, పంకజ, మంగతాయారు, సీసీపీ శ్రీనివాస్, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, చీఫ్ వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వకీల్, జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహాన్, హేమంత్ కేశవ్ పాటిల్, ఉపేందర్ రెడ్డి, వెంకన్న, రవికిరణ్, ప్రాజెక్టు సీఈ దేవానంద్, హౌసింగ్ సీఈ అనిల్ రాజ్ పాల్గొన్నారు.