Property Tax | సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్‌పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100 లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఆస్తిపన్ను రూ.1200 లోపు ఉన్న భవనాలకు ఏటా రూ.101లు పన్ను చెల్లిస్తే సరిపోతుందని ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తూ జీవో జారీ చేశారు. ఈ పథకాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఇటీవల సదరు యాజమానికి ప్రసాద్‌రావుకు ఎలాంటి సమాచారం లేకుండా సవరించిన ఆస్తిపన్ను నోటీసు అందింది. రూ.101 నుంచి ఏటా రూ.10,608ల చొప్పున ట్యాక్స్ వేసి నాలుగేళ్ల ట్యాక్స్ ఒకేసారి రూ. 43,267లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. దీంతో కంగు తినడం ప్రసాద్ రావు వంతైంది.
ట్యాక్స్‌ను అకస్మాత్తుగా ఎందుకు సవరించాల్సి వచ్చింది? రూ.101 స్కీం ఎత్తివేస్తూ జీవో ఏమైనా జారీ చేశారా? ఒకవేళ సవరిస్తే గతంలో మాదిరిగా రూ.1100లు కట్టాలి.. కానీ ఎందుకు ఏటా రూ. 10,608 లు కట్టాలి? వంటి ప్రశ్నలు వేసుకుంటున్నాడు. తన ఇంటి చుట్టు పక్కల ఎవరికీ రూ.1400 నుంచి రూ.2800లకు మించలేదు.. ఇదెక్కడి అన్యాయమని డిప్యూటీ కమిషనర్లను, టీఐ (ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల)ను అడిగినా ఫలితం లేదు. ఇదేక్కడి సవరణ, ఆస్తిపన్నుల జారీలో ఇష్టారాజ్యంగా అధికారుల వ్యవహారం ఉందంటూ సదరు ప్రసాదరావు సమగ్ర వివరాలతో సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఇక్కడ ఒక్క ప్రసాదరావుకే కాదు.. గ్రేటర్లో చాలా మంది రూ.101 స్కీం లబ్ధిదారులపై జీహెచ్ఎంసీ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నది. ఇటీవల జీహెచ్ఎంసీ ప్రతి శనివారం నిర్వహిస్తున్న ఆస్తిపన్ను పరిష్కార వేదికలో ఈ తరహా ఫిర్యాదులు వస్తుండడం అధికారుల పనితీరుకు నిదర్శనం.
రాయితీ పథకం రద్దు?
పేద, మద్య తరగతి ప్రజలకు కల్పించిన ఆస్తిపన్ను రాయితీ పథకానికి కాంగ్రెస్ సర్కారు నీళ్లొదిలింది. ఆస్తిపన్ను రూ.1200లోపు ఉన్న నిర్మాణాలకు 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆ పరిధిలోని యజమానులంతా ఏడాదికి రూ. 101 పన్ను చెల్లిస్తే సరిపోతుందని కేసీఆర్ ప్రభుత్వం హామి ఇచ్చి ఆమలు చేశారు. ఈ మేరకు రూ.100కోట్ల మేర చెల్లింపుదారులకు లబ్ధి జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అనధికారికంగా రద్దు చేసింది. పన్ను సవరణ పేరుతో లబ్ధిదారుల మెడపై కత్తి పెట్టి. మీకు రూ.101 ఆస్తిపన్ను పథకం వర్తించదని, ఇకపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాలంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నది. సెక్షన్ 220 ప్రకారం ట్యాక్స్ సవరణపై ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం రూ.101లు చెల్లించే పన్ను చెల్లింపుదారులకు పన్ను రాయితీ లేదంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు.
అడ్డగోలుగా సవరణలు
జీహెచ్ఎంసీ పరిధిలో 19.49లక్షల ఆస్తులు ఉన్నాయి. వీటిలో గృహాలు 16.35లక్షలు, గృహాలు కానివి 2.80లక్షలు, మిక్స్డ్ 34వేల వరకు ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2100కోట్ల రూపాయలు రాబట్టే లక్ష్యంతో ఇప్పటి వరకు12.50 లక్షల మంది చెల్లింపుదారుల నుంచి రూ. 1506 కోట్ల వరకు రాబట్టారు. లక్ష్యం చేరుకోవడానికి ప్రస్తుతం రూ.101 ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలకు రేట్లను సవరించి పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించి, పెంచిన నాలుగు రేట్ల పన్నునే టార్గెట్‌గా వసూలు చేస్తున్నారు. నాలుగు కేటగిరీల్లోని రెండు లక్షల నిర్మాణాలను సర్వే చేసి..మొత్తంగా రూ.50కోట్ల మేర ఆదాయం పెంచుతుండడం గమనార్హం. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే అడ్డగోలుగా సవరణలు చేస్తుండడం, ఇందుకు విద్యుత్‌శాఖ బిల్లులు, సబ్ రిజిస్ట్రార్లను పావుగా వాడుకుంటూ క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారీతిలో వ్యవహరిస్తుండడంతో ఆస్తిపన్ను బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది.