సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నా.. ఎక్కడ చూసినా సరఫరాలో అంతరాయలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు.. కరెంటు పోవడం.. రావడం అనేది నిత్యకృత్యంగా మారింది. ప్రకటిత విద్యుత్ కోతలు లేకున్నా.. అప్రకటిత విద్యుత్ అంతరాయాలు మాత్రం నిత్యం ప్రతి సర్కిల్లోనూ షరా మామూలే అన్నట్లుగా మారింది. కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదు చేస్తుంటే.. మరి కొందరు నేరుగా విద్యుత్ శాఖ కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు.
స్థానికంగా ఉండే సెక్షన్ ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లకు సైతం చేసే ఫిర్యాదులు లెక్కలేనన్ని వస్తున్నాయి. తాజాగా సోమవారం కూకట్పల్లి ప్రాంతంలోని ఎల్లమ్మబండ కమలమ్మ కాలనీ నుంచి ఓ వ్యక్తి రెండు గంటలుగా కరెంటు నిలిచిపోయిందంటూ టీజీఎస్పీడీసీఎల్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. బండ్లగూడలో రోజూ విద్యుత్ అంతరాయం ఉంది. తరచూ అంతరాయాలతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని మరో విద్యుత్ వినియోగదారుడు పోస్టు చేశారు. ఇలా ప్రతి రోజూ ట్విట్టర్ వేదికగానే పదుల సంఖ్యలో విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదులు వస్తుండగా, ఇక కాల్ సెంటర్‌కు నేరుగా వచ్చేవి, స్థానికంగా ఉండే అధికారులకు, సిబ్బంది చేసే ఫిర్యాదులు లెక్కలేనన్ని ఉంటున్నాయి.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 15 జిల్లాలు ఉండగా, అందులో అత్యంత కీలకమైంది గ్రేటర్ పరిధి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధుల్లో పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోనే మొత్తం 10 సర్కిళ్లను ఏర్పాటు చేసి, వాటిని గ్రేటర్ పరిధిగా పరిగణిస్తున్నారు. ఈ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్‌తో పాటు సికింద్రాబాద్, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, హబ్సిగూడ, మేడ్చల్, సంగారెడ్డి సర్కిళ్ల ద్వారా క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్వహిస్తున్నారు.
దక్షిణ డిస్కంలో మొత్తం కోటి 10 లక్షల కనెక్షన్లు ఉంటే అందులో గ్రేటర్‌లోనే 68 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ నిరంతరం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ నెట్ వర్క్ ఉన్నా.. దాని నిర్వహణ,సకాలంలో మరమ్మతు చేపట్టకపోవడంతో అంతరాయాలు తలెత్తున్నాయి. క్షేత్ర స్థాయిలో నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పని చేయాల్సి ఉన్నా, ఆదిశగా నిర్వహణ లేదు.