సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): వరుసగా ఇంధన ధరలు పెరగుతుండటంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎన్జీ ధర సైతం కిలో రూ.2 పెంచి కేంద్రం షాక్ ఇచ్చింది. గత పది రోజుల్లో వరుసగా సీఎన్జీ సైతం నాలుగు సార్లు ధర పెరిగింది. విడతలవారీగా రూ.6 పెరిగింది. దీంతో ప్రస్తుతం సీఎన్జీ ధర కిలో రూ.99కి చేరింది. ఓవైపు నగరంలో సీఎన్జీ కోసం ఆటోలు, క్యాబ్‌లు బంక్‌ల ముందర గంటల తరబడి క్యూలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంటే మరోవైపు ధరలు పెంచుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు చాలావరకు బంకుల్లో సీఎన్జీ అందుబాటులో ఉండటం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు.
ప్రజలపై పెను భారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఇంధన ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెంచి బండి నడపాలంటే భయపడేలా చేశారు. గిరాకీ లేక ఇప్పటికే సతమతమవుతుంటే ఇంధన ధరలు పెంచి డ్రైవర్ల జీవితాలను చీకట్లోకి నెట్టేశారు.
– వేముల మారయ్య, ప్రెసిడెంట్, బీఆర్టీయూ
ఇంధన ధరలు తగ్గించాలి
నగరంలోని చాలా బంకుల్లో సీఎన్జీ దొరకడం లేదు. దొరికిన చోట కిలో మీటర్ల క్యూ ఉంటుంది. ఇంధనం లేకపోతే ఆటో నడపలేం. సమయం అంతా బంక్‌ల వద్దే సరిపోతుంది. సీఎన్జీ కూడా సరిపడా లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కిలోపై ఇప్పటివరకు వరుసగా రూ.6 పెంచారు. కేంద్రం వెంటనే ఇంధన ధరలు తగ్గించాలి.
– శాతం రమేష్, ఆటో యూనియన్ నాయకుడు