నగర శివారులోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, విశ్వ నగర స్థాయి సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వం ఆకాశమంత ఆశలు కల్పించింది..కానీ ఎక్కువ సమయం తీసుకోకుండానే జీహెచ్ఎంసీ శివారు ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. జీహెచ్ఎంసీకి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.11,460 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా సోమవారం స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఐతే విలీనమైన పురపాలికల నుంచి వచ్చే ఆదాయానికి, కేటాయింపులకు ఎక్కడా పొంతన లేకుండా ఏకంగా రూ. 400 కోట్ల మేర టోకరా వేయనుందని పద్దుల్లో తేల్చింది.
పన్నులు, నిర్మాణ రంగ ఫీజులు, ట్రేడ్ లైసెన్స్‌ల రూపంలో వసూళ్లకు రాబట్టుకుని ..వారికి సౌకర్యాల కల్పనలో మాత్రం వచ్చిన నిధులను పాత జీహెచ్ఎంసీ పరిధిలోకి మళ్లించే చర్యలకు అడుగులు వేయడంతో శివారు ప్రాంత పౌరులు విస్మయం చెందుతున్నారు. రూ.2,260 కోట్ల ఆదాయం వస్తుండగా…రూ.400కోట్ల మేర కేటాయింపుల్లో టోకరా వేసింది..ఈ నిధులను పాత జీహెచ్ఎంసీ పరిధిలోనే ఖర్చు చేస్తుండడంపై శివారు ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడంగ్‌పేట, నార్సింగి, మణికొండ పురపాలికలు ప్రతి ఏటా రూ.200 కోట్ల మేర సర్ఫ్లస్లో బడ్జెట్ ఉండేదని, మౌలిక వసతుల కల్పనపై సవతి ప్రేమ తగదని మండిపడుతున్నారు. విలీనమైన పురపాలికలకు అభివృద్ధిలో జీహెచ్ఎంసీ ‘మొండిచెయ్యి’ చూపడం అన్యాయమని అంటున్నారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. 625 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఈ మొత్తానికి ఆమోదం తెలిపారు. ఐతే రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ మహా నగరంలో దాదాపు అభివృద్ధి పడకేసిన దరిమిలా రానున్న ఆర్థిక సంవత్సరం పెద్ద ఆశాజనకంగా ఏమీ కనిపించడం లేదు. ప్రధానంగా రానున్న ఫిబ్రవరి పదితో పాలక మండలి గడువు తీరనున్నది. ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు వెళుతుందా? కొన్ని నెలలు వేచి చూస్తుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు సాదాసీదా గానే అంకెల్ని పేర్చి బడ్జెట్‌ను ముగించారు.
గత ఆర్థిక సంవత్సరంలో సవరణ బడ్జెట్ పరిమాణం రూ.11,010 కోట్లుగా ఉంటే వచ్చే వార్షిక సంవత్సర బడ్జెట్‌ను రూ.11,460కోట్లకు చేసి ఆమోదం తెలిపారు. గతేడాదితో పోల్చితే రూ. 450కోట్లు మాత్రమే పెంచడం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నది. కాగా 2025-26లో రూ.700 కోట్ల రుణాలకు అంచనా వేసిన గ్రేటర్.. మరో రూ.183 కలుపుకొని అప్పులు తెచ్చుకోవాలని నిర్ణయించింది. అందుకే రానున్న ఏడాదిలోనూ రాష్ట్ర సర్కారుపై పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు.
మునుపటి కంటే కేవలం రూ.100 కోట్లు మాత్రమే అదనంగా ఆశిస్తున్న జీహెచ్ఎంసీ.. రుణాలను మాత్రం గతం కంటే అదనంగా వంద కోట్లు తెచ్చుకోవాలని భావిస్తుండడం గమనార్హం. రెవెన్యూలో భాగంగా జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరులైన నిర్మాణ రంగ అనుమతుల రూపంలో గతేడాది రూ.1,170కోట్లు వస్తుందని పేర్కొనగా..వచ్చే ఏడాది కేవలం రూ.30కోట్లు పెంచి రూ.1200కోట్లు చూపించడం విశేషం. ట్యాక్స్‌లు, మ్యుటేషన్, ప్రకటనల ఆదాయాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. ప్రసుత్తం మిగులు నిధులతో ఉన్న మున్సిపాలిటీలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగులు నిధులకు జీహెచ్ఎంసీ చరమగీతం పాడడంతో పాటు సర్కార్ ఇచ్చే నిధులపైనే శివారు ప్రాంతాలు ఆధారపడి ఉండాలనేది బడ్జెట్ అంచనాలు తెలియజేస్తున్నాయి.

Pp