సిటీ బ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో కారు జోరు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా కేసీఆర్ వెంటే ఉంటామని కుండ బద్ధలుకొట్టి చెప్తున్నారు. బీఆర్ఎస్ చేపడుతున్న ప్రచారాలకు అన్ని డివిజన్ల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఓ వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహిస్తూ ఓటర్లలో జోష్ నింపుతుంటే.. మరోవైపు పార్టీ ప్రధాన నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన, నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలు కారు గుర్తుకే తమ మద్దతు అని భరోసా ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలను ఎన్నికల హామీలపై నిలదీస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు పెంచుతామని చెప్పి మోసం చేశారంటూ కాంగ్రెస్ మంత్రులను నిలదీస్తున్నారు.