KTR | మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 20: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పైసలు లేవంట కానీ.. మూసీకి మాత్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తానంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల అబద్ధపు మాటలు వింటుంటే ప్రజలకు చిరాకు వస్తుందని తెలిపారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె పెట్టిండు అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందని అన్నారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వనం శ్రీరామ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి కార్తీక్ రెడ్డితో కలిసి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లోకల్ నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని అన్నారు. వారు అగ్రనేతలను తీసుకొచ్చి డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారనని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మలేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు పెద్దవి, చేతలు చిన్నవని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉంటే ముట్టుకోరు, కానీ పేదల ఇండ్లను మాత్రం హైడ్రా పేరుతో కూల్చేస్తున్నారని మండిపడ్డారు. రాజేంద్రనగర్‌లో నాకు భూములు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని.. ఆ భూములు ఎక్కడ ఉన్నాయో వారే చూపించాలని అన్నారు. ఫిబ్రవరి నెలలో 31వ తేదీ ఉంటుందనేది ఎంత నిజమో.. రేవంత్‌రెడ్డి మాటలు కూడా అంతే నిజమని ఎద్దేవా చేశారు. ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయి కానీ రెండే రెండు పార్టీలు చరిత్రలో నిలిచిపోయాయని తెలిపారు. అవి ఒకటి తెలుగుదేశం, రెండోది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఒక్క మంచి పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. మత పిచ్చి, కుల పిచ్చి లేపడం తప్ప వారికి మరొకటి లేదని అన్నారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని.. హిందువులు ప్రమాదంలో ఉంటే ప్రధాని మోదీ విఫలమైనట్లే కదా అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతం పేరుతో ఓట్లు అడగడమే బీజేపీకి పనిగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని ప్రధాని మోదీనే మాట్లాడాడని.. దానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అమృత్ టెండర్లు రేవంత్ రెడ్డి బావమరిదికి కట్టబెడితే కేంద్ర ప్రభుత్వం చర్యలు లేవని అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెడితే ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచమే గులాబీ జెండా అని తెలిపారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల , రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఈ రెండు నియోజకవర్గాల బీఆర్ఎస్ శ్రేణులు హుషారు కావాలని సూచించారు. రాజేంద్రనగర్ నుంచి వచ్చిన వారి ఉత్సాహం చూస్తుంటే తొందరలోనే పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారనే నమ్మకం గట్టిగా అనిపిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో జెండా దిమ్మెలకు గులాబీ రంగులు వేసుకోవాలని దిమ్మె లేకపోతే కొత్తవి కట్టుకోవాలన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.