సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ ఢిల్లీ అధిష్ఠానం అదిరేలా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి గోపీనాథ్‌కు నిజమైన నివాళులర్పించాలని గులాబీ శ్రేణులు, మాగంటి అభిమానులకు పిలుపునిచ్చారు. రహమత్ నగర్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి హైదరాబాద్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయాలని శ్రేణులకు సూచించారు.
పదేండ్ల తెలంగాణలో మాగంటి చేసిన అభివృద్ధిని చూసి సునీతకు ఓటేయాలని కోరారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసపోయిన ప్రతి తెలంగాణ ఆడబిడ్డలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో రేవంత్‌రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌నేత హరీశ్ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు, వాటర్, కరెంట్ బిల్లులు బంద్ కావాలంటే బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని గులాబీ శ్రేణులకు సూచించారు.
వేలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి వేలాదిగా తరలివచ్చిన ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ గులాబీ మయమైంది. నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులు, మాగంటి గోపీనాథ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. రహమత్‌నగర్ వీధులన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో ఎస్పీఆర్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. తమ అభిమాన నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామంటూ నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీల నుంచి మాగంటి అభిమానులు తరలివచ్చారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. పదేండ్ల పాటు తమకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించిన మాగంటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో ఘనమైన నివాళులు అర్పిస్తామని తేల్చి చెప్పారు. అదేవిధంగా మాగంటి గెలుపును కాంక్షిస్తూ కార్యకర్తల సమాశానికి రాష్ట్రం నలుమూలల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు.
ఇందిరమ్మ పాలనలో ఒక్క ఇల్లు అయినా కట్టారా?
వెంగళరావునగర్, అక్టోబర్ 13 : ఇందిరమ్మ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు అయినా కట్టారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నిలదీశారు. సోమవారం రహ్మత్ నగర్ డివిజన్ ఎస్.పీ.ఆర్.హిల్స్‌లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో పేదలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. నియోజకవర్గంలో 3,600 ఇండ్లు కట్టించి పేద ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు.
మహంకాళి జాతర, బతుకమ్మ పండుగ, రంజాన్, క్రిస్మస్ వేడుకల్లో మాగంటి గోపీనాథ్ ప్రత్యేక కార్యక్రమాలు చేసేవారని గుర్తుచేశారు. ఎస్పీఆర్హిల్స్లో తాగు నీటి రిజర్వాయర్ నిర్మించడంలో మాగంటి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. శివమ్మ పాపిరెడ్డిహిల్స్ ప్రాంత వాసుల్ని పీజేఆర్ నిలబెట్టిండు..మాగంటి అండగా నిలిచిండు..పోలింగ్ బూత్‌లోకి వెళ్లినప్పుడు మాగంటి గోపీనాథ్‌ను గుర్తు చేసుకోవాలని సూచించారు. ముస్లింలకు కబరస్తాన్ స్థలం మంజూరు చేయాలని ఎన్నికల ముందు మాగంటి కోరారని..మళ్లీ ప్రభుత్వం వచ్చాక ఇద్దామనుకున్నామని..ఓడిపోయామని..కేసీఆర్ సీఎం అయితేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.