KTR | అంబర్‌పేట, అక్టోబర్ 23 : తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వెంటనే హోం శాఖ మంత్రిని నియమించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం బాగ్‌అంబర్‌పేట సాయిబాబానగర్ కాలనీలో హత్యకు గురైన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, కార్పొరేటర్ పద్మావెంకటరెడ్డితో కలిసి వెళ్లారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. లింగారెడ్డి దంపతులను పట్టపగలు కిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ జంట హత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటూ స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. ‘జగిత్యాలలో జీవన్‌రెడ్డి అనుచరుడిని హత్య చేశారు. ఇక్కడ హైదరాబాద్‌లో వృద్ధ జంటను కిరాతకంగా హత్య చేశారు. జంట హత్యలు జరగడంతో హైదరాబాద్‌లో ప్రజలు భయం తో ఉన్నారు’ అని పేర్కొన్నారు.
శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని నగర సీపీ, డీజీపీలను కోరుతున్నానన్నారు. ‘పోలీసులకు సరైన వ్యవస్థ, స్వేచ్ఛ ఇచ్చి వాళ్ల పని వాళ్లను చేసుకోనివ్వాలి. పోలీసు అధికారులను మా పైకి.. అశోక్‌నగర్‌లో పిల్లల పైకి ఉసిగొల్పకుండా శాంతిభద్రతలు చూడనివ్వాలి. సమర్థవంతమైన పోలీసు అధికారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ల పని వాళ్లను చేయనివ్వాలి’ అని అన్నారు.
లింగారెడ్డి, ఊర్మిళదేవి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆత్మైస్థెర్యాన్ని అందించాలన్నారు. తాము పది లక్షల సీసీ కెమెరాలు నగరంలో ఏర్పాటు చేశామని, అవి పనిచేయకపోతే ప్రభుత్వం బాగుచేయించాలని, సర్కారు పట్టించుకోకపోతే తామే వాటికి మరమ్మతులు చేయిస్తామని కేటీఆర్ చెప్పారు. జంట హత్యలకు పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి ప్రజల ముందుంచాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.