KTR | ఢిల్లీకి మూటలు పంపేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల మూసీ ప్రాజెక్టును చేపడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేవలం రూ.25 వేల కోట్ల వ్యయంతో మూసీ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్లతో ఈ ప్రాజెక్టును ఎందుకు చేపడుతున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరమున్నదని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు, రూపొందించిన ప్రణాళికల వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు.
ముఖ్యమంత్రికి బంపర్ ఆఫర్ ఇస్తున్న. రిజువనేషన్ అనే పదానికి చూడకుండా రేవంత్‌రెడ్డి స్పెల్లింగ్ చెప్తే ఆయనకు తళతళ మెరిసే, రూ.50 లక్షలు పట్టేంత బ్యాగును బహుమానంగా ఇస్త!
గూగుల్ నుంచి ఎత్తుకొచ్చిన ఫొటోలతో లక్షన్నర కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇంత దికుమాలిన ప్రజెంటేషన్ ఇస్తరా? సీఎం మూసీప్రజెంటేషన్ చూసిన తర్వాత అది సామ్ అని అందరికీ అర్థమైంది.
-బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో/హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్న మూసీ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, ఢిల్లీకి మూటలు పంపేందుకే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల ఖర్చు అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రూ.25వేల కోట్లతో మూసీ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్లతో ప్రాజెక్టు ఎందుకు చేపడుతున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు. తాము మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదన్న కేటీఆర్.. మూసీ పేరిట లూటీ చేస్తే, మూసీ పేరిట పేదల ఇండ్లను కూల్చివేసి వాళ్ల పొట్టగొడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని ఎందు కు ముందు వేసుకున్నదో చెప్పాలని నిలదీశారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రణాళికలు, పనుల వివరాలపై కేటీఆర్ తెలంగాణ భవన్లో శుక్రవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రూ.16వేల కోట్లతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బీఆర్ఎస్ రూపొందించిన మూసీ ప్రణాళికలను కాదని, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ లక్షన్నర కోట్లకు ఎందుకు పెంచారో వివరించే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి లేదని దుయ్యబట్టారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత్త!
‘సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల కిందట ఇచ్చిన రెండు గంటల ప్రజెంటేషన్‌తో తన పరువు తానే తీసుకున్నాడు. చేయని సర్వేను చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పరీవాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదని అక్కడి ప్రజలే చెప్తున్నారు. అసలు సామాజిక, ఆర్థిక, పర్యావరణ సర్వేలు జరగనే లేదు. ఆయన పాపం బయటపడటంతో ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో సీఎంకు ముచ్చెమటలు పడుతున్నయ్. ఏం చేయా లో తెలియక గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లక్షన్నర కోట్ల కుంభకోణాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. సీఎం మూసీ ప్రేమ అంతా ఢిల్లీకి పంపే మూటల కోసమేనని ప్రజలకు తెలిసివచ్చింది.
ఒకేలా బడేభాయ్ చోటేభాయ్ మాటల మార్పు..
మూసీపై సీఎం ఒకరోజు సుందరీకరణ అంటా రు.. మరో రోజు పునరుజ్జీవనం అంటారు.. ఇంకోరోజు నల్గొండకు మంచినీళ్లు అంటారు. మూసీపై సీఎం మాటలు సరిగ్గా పెద్దనోట్ల సమయంలో మోడీ రోజుకో మాట ఎలా మార్చిండో అట్లనే ఉన్నయ్. ముఖ్యమంత్రి అపరిచితుడిలా మారారు. మూసీ సుందరీకరణ అనే మాట వాడిందే సీఎం. గోపన్నపల్లిలో సుందరీకరణ మాట అనడమే కాకుండా లక్షన్నర కోట్లతో చేపడుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు సుం దరీకరణ ఎక్కడి నుంచి వచ్చిందంటున్నరు.
రెండు పార్టీలదే మూసీ పాపం
గత పాలకులు చేసిన పాపంతో మురికికూపంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. 2015లో జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం కాలుష్యంలో చిక్కుకున్న నదుల జాబితాలో మూసీ అగ్రభాగాన ఉన్నది. అంటే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేకంటే ముందు ఉన్న ప్రభుత్వాల పాపమే కదా ఇది! రేవంత్‌రెడ్డి ఉన్న కాంగ్రెస్, గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మూసీ మురికికూపంగా తయారైందని పీసీబీ నివేదికలోనే ఉన్నది.
16,634 కోట్లతో మూసీ సమగ్ర ప్రణాళిక
90-95 ఏండ్ల పాటు మూసీపై ఏ ప్రభుత్వం కూడా గొప్పగా పని చేయలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మూసీ నివేదికను పరిశీలించి సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో 2017లో మూసీ రివర్‌ఫ్రంట్ ఎజెండాను తీసుకొని ఆరు ప్రధాన అంశాలను ప్రా ధాన్యతగా ఎంచుకొని, ప్రణాళికాబద్దంగా పని చేసేందుకు కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేసినం. ప్రాజెక్టును మానవీయ కోణంలో చేయాలనుకున్నామే తప్ప పేదల ఇండ్లను కూల్చి అమలు చేయాలనుకోలేదు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవనంతో పాటు నల్లగొండకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే సంకల్పం పెట్టుకున్నం. రూ.16,634 కోట్లతో సమగ్రమైన అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిం చాం. భారతదేశంలోనే వంద శాతం మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యాన్ని బీఆర్ఎస్ హయాంలోనే రూపొందించి, అమల్లోకి తెచ్చాం.
లక్ష మంది బతుకు ఆగం..
మూసీ రివర్ బెడ్లో కొన్ని అక్రమ కట్టడాలు ఉ న్నాయి. ఎంజీబీఎస్ కూడా అక్రమ నిర్మాణమే. మెట్రో స్టేషన్ కూడా రివర్ బెడ్‌లోనే ఉన్నది. అదికూడా అక్రమ నిర్మాణమే. అలా 900 నిర్మాణాలు ఉన్నాయని కేసీఆర్‌కు చెప్పాం. 2020లో వరదలొచ్చినప్పుడు అక్టోబర్‌లో ఎంఎఫ్ఎల్(మాక్సిమమ్ ఫ్లడ్ లెవల్), హెచ్ఎఫ్ఎల్ (హయ్యెస్ట్ ఫ్లడ్ లెవల్) మార్కింగ్ చేసి పెట్టాం. డ్రోన్ సర్వే చేసి ఏ స్థాయి వరకు నీళ్లొచ్చాయో గుర్తించాం. ఈ స్థాయి తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన సమస్యను మేం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఇంటికి అప్పటి ప్రభుత్వాలే అనుమతినిచ్చా యి. ఈ లెక్కన ప్రతి ఇల్లు కూడా సక్రమమే. 40-50 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఇలా అక్కడ 11,000 నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఇండ్లను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో స్ట్రక్చర్‌లో మూడు, నాలుగు కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన మొత్తం సుమారు లక్ష మంది నిరాశ్రయులయ్యే పరిస్థితి ఉన్నది.
మనం 11 వేల నిర్మాణాలను తొలిగిస్తే లక్ష మంది నిరాశ్రయులవుతారు అని కేసీఆర్‌కు చెప్పాం. ఆ సమయంలో కేసీఆర్ ఒక్కటే మాట అన్నారు. ఈ ప్రాజెక్టు పక్కకుపెట్టండి. లక్ష మందిని రోడ్డున పడేసి మీరేం సాధిస్తారు, ఇది కరెక్ట్ కాదు. సబర్మతి తరహా రెండు వైపులా కరకట్ట లేపండి. ఫ్లడ్ లేకుండా చూసుకొండి. ఎక్స్‌ప్రెస్‌వే కట్టండి, మొబిలిటీ పెంచండి. అంతేగానీ పేదవాడి కడుపుమీద మాత్రం కొట్టొద్దు. ఎవ్వరో సుందరీకరణ కోసం.. దేనినో సాధించడం కోసం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయడం సరికాదు అన్నా రు. కావాలంటే 900 ఇండ్ల వరకు అనుమతిస్తాను.. వారికి పునరావాసం కల్పించండి.. ముందు ఎస్టీపీలు పూర్తి చేయండి.. గోదారి నీళ్లు తీసుకురండి.. బ్రిడ్జిలు కట్టండి. ఆ 900 మందికి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టి వారితో గృహప్రవేశం చేయించి ఆ తర్వా త ప్రాజెక్టు మొదలెట్టండి అని చెప్పారు.. 2020లోనే మేం మూసీ ప్రాజెక్టుకు సిద్ధంగా ఉన్నా కేసీఆర్ అక్కడి ప్రజల పరిస్థితి కారణంగా మమ్మల్ని ఆపారు.
సౌత్ ఏషియాలోనే నంబర్ వన్‌గా తెలంగాణ!
వంద శాతం ఎస్టీపీలు పూర్తి చేసి సౌత్ ఏషియాలోనె నంబర్‌వన్‌గా తెలంగాణను నిలిపి తద్వారా నల్లగొండకు శుద్ధమైన నీళ్లు ఇవ్వొచ్చు. కేవలం 1100 కోట్లతో కొండపొచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్లు తెచ్చి గండిపేటలో పోసి కిందకి అంటే నల్లగొండకు ఎప్పుడంటే అప్పుడు శుద్ధమైన నీళ్లు ఇవ్వొచ్చు. పదివేల కోట్లతో వంతెనలు, చెక్‌డ్యాంలు పూర్తి చేసుకోవచ్చు. బఫర్‌లోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. పేదల ఇండ్లు పోకుండానే ప్రాజెక్టు పూ ర్తి చేయొచ్చు. దామగుండంలో మూసీ గొంతు కోసి కిందకొచ్చి ఉద్ధరిస్తానని రేవంత్ పోజులు కొట్టడం దేనికి?
అక్కడ వనమేధం.. ఇక్కడ గృహమేధం
‘వికారాబాద్ అడవుల్లో వనమేధం చేస్తున్నవు.. 12 లక్షల చెట్లు నరుకుతున్నవు. కింద హైదరాబాద్‌లో గృహమేధం చేస్తున్నవు.. 12వేల గృహాలు నేలమట్టం చేస్తున్నవు..లక్షల మందిని రోడ్డున పడే పరిస్థితి తెచ్చినవు. మొత్తంగా సీఎం చేస్తున్నది పునరుజ్జీవనం కాదు ధనయజ్ఞం.
బుల్డోజర్లకు అడ్డంగా ఉంటం!
దామగుండంపై సీఎం మాట్లాడటం చూస్తే ఘోరంగా ఉన్నది. కేటీఆర్ వచ్చి రాజ్‌నాథ్ కారుకు అడ్డం పడుతానంటే నేనొద్దన్నానా అని సీఎం అంటున్నడు. అసలు ముఖ్యమంత్రివి నువ్వా నేనా? మేం పదేండ్లుగా మా మెడపై కేంద్రం కత్తి పెట్టినా దామగుండం ఇవ్వలేదు. నువ్వు దాసోహ పడి నువ్వు కేం ద్రానికి భూమి ఇచ్చి మమ్మల్ని రోడ్డుకు అడ్డం ఉండమంటవా? అలాంటి పరిస్థితే వస్తే తెలంగాణ కోసం మేం రోడ్డున పండుకుంటం.. మీకారుకు అడ్డంగ పం టం.. ప్రజల కోసం బుల్డోజర్లకు అడ్డంగ పంటం.. ఈవిషయంలో మీకు సందేహం అక్కర్లేదు.
నగరం మధ్యలో నదులు..!
సబర్మతి 7 వేల కోట్లల్లో పూర్తయింది. నమామి గంగే ప్రాజెక్టు 2,400 కిలో మీటర్లకు సంబంధించిన ప్రాజెక్టు. దీని మొత్తం విలువ 40వేల కోట్లు. అంటే కిలో మీటర్‌కు పదివేల కోట్లు. కానీ సీఎం చెప్తున్న మూసీ ప్రాజెక్టు విలువ లక్షన్నర కోట్లు అనుకుంటే కిలో మీటర్‌కు 2,700 కోట్లు అవుతాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రాజెక్టు. ఇంత పెద్ద లూటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ దేశంలో ఏ నదీ నగరం మధ్య నుంచి పోవడం లేదంటున్న డు. ఢిల్లీలో యమునానది నగరంలో లేదా? కలకత్తాలో హుగ్లీ నది లేదా? లక్నోలో గోమతి లేదా? అహ్మదాబాద్‌లో సబర్మతి లేదా? శ్రీనగర్‌లో జేలం లేదా? ఇవన్నీ నగరంలో ఉన్న నదులు కాదా? సీఎం అనాలోచితంగా మాట్లాడొచ్చా?
స్వచ్ఛందంగా కూల్చుకుంటే వారి ఇంటికి వెళ్దాం!
ప్రజలే సంతోషంగా వెళ్లి వాళ్ల ఇల్లు కూలగొట్టుకున్నారని సీఎం చెప్పడం అత్యంత బాధాకరం. స్వచ్ఛదంగా సంతోషంగా ఇల్లు కూలగొట్టుకుంటే మనిద్దరం వారి ఇంటికి వెళ్దాం. వాళ్ల ఇల్లు కూలగొడుతుంటే మళ్లీ వాటిని నిర్మించేందుకు అభంశుభం తెలియని పిల్లలు ప్రయత్నిస్తున్నరు. ఈ పిల్లలు సంతోషంగా ఇల్లు కూలగొట్టుకొని వెళ్లారని సీఎం చెప్పడం పచ్చి అబద్ధం.
తిమ్మిని బమ్మి చేసే మెయిన్‌హార్ట్!
మెయిన్‌హార్ట్ కంపెనీ బాగోతం మామూలుగా లేదు. లాహోర్‌లో రావి అనే రివర్ బెడ్ డెవలప్మెం ట్ తీసుకున్నారు. సుమారు 50వేల కోట్లు అని నిర్ధారించారు. తర్వాత ప్రభుత్వం మారింది. ఇమ్రాన్ఖా న్ సర్కార్ వచ్చింది. ఆ విలువ డబుల్ అయ్యింది. లక్ష కోట్లకు పాకింది. అంటే విలువ పెంచడంలో ఈ కంపెనీ స్పెషలిస్టు. తిమ్మిని బమ్మి చేయడంలో సిద్ధహస్తులు. అందుకే ఈ కంపెనీ ప్రమోటర్లు డాక్టర్ నసీం షెహజాజ్, మహ్మద్ ఉమర్ హహజాన్లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కంపెనీ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇం డియా వాళ్లు కూడా ఈ కంపెనీని డిబార్ చేశారు. ఇలాంటి కంపెనీపై సీఎం రేవంత్‌కు ఎందుకంత ప్రే మనో చెప్పాలి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సర్కార్ కూడా ఈ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
కేటీఆర్‌కు నాయకుల అభినందనలు
మూసీపై బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపాదనలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అద్భుతంగా వివరించిన కేటీఆర్‌ను పార్టీ సీనియర్ నాయకులు అభినందించారు. వీరిలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, కేపీ వి వేకానంద, గోపీనాథ్, ఎమ్మెల్సీ వాణిదేవి ఉన్నారు.
వడ్డించిన విస్తరిలా ఇచ్చాం
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా వంద శాతం మురుగునీటి శుద్ధి చేపట్టాం. రూ.545 కోట్లు కేటాయిస్తూ 14 బ్రిడ్జిలు మంజూరు చేశాం. మూసీ పశ్చిమం నుంచి తూర్పునకు 54 కిలోమీటర్ల మేర బ్రిడ్జిలతో పాటు వాటి కింద చెక్‌డ్యాంలు ఉండేలా డిజైన్లు రూపొందించాం. తద్వారా 3-4 కిలోమీటర్లకు నిర్మించే ఒక్కో బ్రిడ్జి వద్ద నీళ్లు నిల్వ ఉండటం వల్ల అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కంపెనీల నుంచి బ్రిడ్జి డిజైన్లను కూడా ఆహ్వానించి, తీసుకున్నాం. పారిస్, గ్రీస్, యూరప్‌లో నాలుగు నగరాలకు అధికారుల బృందాన్ని పంపి అక్కడ ఉండే బ్రిడ్జిలపై అధ్యయనం చేయించాం. ఆ నమూనాలను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ చారిత్రక సంస్కృతి ఉట్టిపడేలా తొమ్మిది సంస్థలు ఇచ్చిన బ్రిడ్జి డిజైన్లను కూడా సిద్ధం చేశాం. 15 బ్రిడ్జిల్లో ఐదు బ్రిడ్జిలకు శంకుస్థాపన కూడా చేశాం. రూ.10వేల కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ ప్రణాళిక కూడా సిద్ధమైంది. టెండర్లు పిలవాల్సి ఉన్నది. ఇలా అన్నీ చేసి, వడ్డించిన విస్తరిలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మూసీని అప్పగించాం. దురదృష్టవశాత్తు మేం అధికారంలోకి రాలేదు. కానీ కొత్త ప్రభుత్వం రూ.20-25వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం లక్షన్నర కోట్లకు పెంచింది.
మూసీ చరిత్ర ఇది..
అనంతగిరి కొండల్లో ఉద్భవించే మూసీ 226 కిలోమీటర్లు ప్రవహించి దిగువన వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 1591లో కులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగరాన్ని మూసీ తీరాన హైదరాబాద్‌ను నిర్మించారు. చారిత్రక నగరానికి 1908లో వచ్చిన వరద తర్వాత నగరానికి పొంచి ఉన్న ముంపును నివారించేందుకు ప్రసిద్ధ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నగరానికి తలభాగంలో ఉండే ప్రాంతంలో హిమయత్సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండికోట) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించారు. నగరానికి మంచినీటిని అందించడంతో పాటు నగరాన్ని ముంపు నుంచి తప్పించే రెండు ప్రధాన కారణాలతో వీటిని నిర్మించారు. పశ్చిమాన ఉన్న మంచిరేవుల నుంచి తూర్పున ఉన్న ఔటర్ రింగు రోడ్డు వరకు 57.5 కిలోమీటర్లలోనే దాదాపు 84 మీటర్ల కిందకు అంటే కిలోమీటరుకు ఒకటిన్నర మీటర్ల డ్రాపింగ్‌తో దిగువకు ప్రవహిస్తుంది. మూసీలోకి 54 నాలాల ద్వారా వరద, మురుగు, పరిశ్రమల నుంచి జలాలు కూడా వస్తాయి.
కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ!
మూసీ సుందరీకరణ కాదు.. లూటిఫికేషన్ చేయడమే ఎజెండాగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది. రాహుల్ గాంధీకి ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు మూటలు పంపేందుకు తెలంగాణ ఏటీఎంలా మారింది. అందుకే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు అని సీఎం చెప్తున్నారన్నారు. మళ్లీ లక్షన్నర కోట్లు కాదని..అలా ఎవ్వరన్నారని రేవంత్‌రెడ్డి ఎదురు ప్రశ్నించడం విస్మయం కలిగించింది. ఏప్రిల్ 21న 50వేల కోట్లతో మూసీని ప్రక్షాళన చేస్తామని సీఎం మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి జూపల్లి జూలై 14న 70 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామన్నారు. మూడు నెలల్లో ఏం మారిందో తెలియదు కానీ జూలై 20న సీఎం రేవంత్ లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామన్నారు.
నీకున్నదే 30 కోట్లు.. 140 కోట్లు ఎక్కడి నుంచి వస్తయ్?
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియ అప్పటికే అమలులో ఉన్నది. బీఆర్ఎస్ చేసింది. ఎఫ్టీపీలు పూర్తయ్యాయి. డిజైన్లు, ల్యాండ్‌స్కేప్, ప్రణాళికలు అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిన్నింటినీ వదిలేసి 140 కోట్లు వృథా చేయడానికి డీపీఆర్ ఎందుకు? కొత్తగా 140 కోట్లు ఎవరి ప్రయోజనాల కోసం? సీఎం తన ఆస్తి అమ్మి కడుతానని అంటున్నడు.. నాకు ఓ సందేహం కలిగింది.. చెక్ చేసుకున్న.. ఆయన ఎన్నికల సమయంలో అఫిడవిట్లో డిక్లేర్ చేసింది 30 కోట్లు. మరి 140 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు. వాళ్ల తమ్ముడు స్వచ్ఛ బయో కంపెనీ నుంచి తెస్తాడా? బావమర్దికి ఇచ్చిన అమృత్ కాంట్రాక్ట్‌లో కొద్దిగా అమృతాన్ని జుర్రుకుంటాడా?
ఆరు గ్యారెంటీలకు లేవుగాని మూసీకెక్కడియి
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలకు పైసలేనప్పుడు మూసీ ప్రాజెక్టుకు పైసలెక్కడి నుంచి వస్తాయో చెప్పాలని రేవంత్‌రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 2013లో భూ సేకరణ చట్టం ప్రకారం మూసీ పరీవాహక ప్రాంతం వారికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘మూసీని వ్యతిరేకిస్తే కసబ్ అంటూ సీఎం పెద్ద మాటలు మాట్లాడాడు.. ఆయనంత పెద్ద మాటలు నేను మాట్లాడను కానీ కసబ్ టెర్రరిస్ట్ అయితే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలతో దొరికిన వ్యక్తి’ అంటూ విమర్శించారు. గూగుల్ నుంచి ఎత్తుకొచ్చిన ఫొటోలతో మూసీపై దిక్కుమాలిన ప్రజెంటేషన్ ఇచ్చారని దెప్పిపొడిచారు. హరీశ్‌రావు సవాల్‌ను సీఎం స్వీకరించాలని, ముందుగా మూసీకి పోయి, ఆ తర్వాత కొండ పోచమ్మ , రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్‌కు పోవాలని సూచించారు.
సీఎం మానసిక స్థితిపై అనుమానం
ముఖ్యమంత్రి మానసిక స్థితి మీద తనకు అనుమానం ఉన్నదని కేటీఆర్ అన్నారు. మూసీ మీద ఆయన ఓరోజు 50వేల కోట్లు అంటాడని, మరో రోజు 1.50 లక్షల కోట్లు అంటాడని, ఐటీ ఇండస్ట్రీ న్యూక్లియర్ చైన్ రియాక్టర్ అంటాడని, దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు దొరుకుతాయని, తెలంగాణలో బాక్రానంగల్, హైదరాబాద్ చుట్టూ మూడు వైపులా సముద్రం ఉందని అంటాడని ఈ మాటలు చూస్తుంటే సీఎం మానసిక పరిస్థితి భయంగా, ఆందోళకరంగా ఉన్నదని, ఆయనను ఆ విధంగా వదిలిపెట్టవద్దని వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.
ఇదీ మా ప్రణాళిక..
మూసీని ఏటీఎంలా వాడుకుంటాం.. లక్ష కోట్లు దోచుకుంటాం.. లక్ష మందిని నిరాశ్రయులను చేస్తామంటే కుదరదు.. పేదల కడుపు కొట్టి, వేల కోట్లు దోచుకొని ఢిల్లీకి మూటలు పంపుతామంటే ఊరుకునేది లేదు..
-కేటీఆర్