సిటీబ్యూరో/ మణికొండ/శంషాబాద్ రూరల్ (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం భూ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుటుంబం భూ కబ్జాకు యత్నించిన బాధిత సతీశ్ షా కుటుంబాన్ని బీఆర్ఎస్ బృందంతో కలిసి అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ సందర్భంగా అధైర్య పడొద్దని బాధితుల పక్షాన న్యాయపరమైన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడి భూకబ్జాలను అడ్డుకుని బాధితుల పక్షాన నిలుస్తామన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలకు గురైన బాధితులెవరైనా తెలంగాణ భవన్‌కు వస్తే అండగా ఉంటామన్నారు. అక్రమార్కుల చెర నుంచి భూములను విడిపించే దాకా కొట్లాడుతామని భరోసా కల్పించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల భూములకు ధరలు పెరిగేలా కేసీఆర్ చేస్తే.. వాటిని కాంగ్రెస్ నేతలు కబ్జాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దొంగ సర్వేలు చేయించి 60 ఏండ్లుగా బాధిత సతీశ్ షా కుటుంబం పేరిట ఉన్న భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బాధితులు భూమిని కోల్పోకుండా రక్షణగా నిలుస్తామని స్పష్టం చేశారు.
