హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తూ తమకు మద్దతు తెలుపాలని సికింద్రాబాద్ ప్రజలంతా సంఘటితమై తమ పార్టీని ఆహ్వానించారని చెప్పారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసిన పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుందని మండిపడ్డారు. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను, ప్రజల అస్తిత్వాలను గుర్తులేకుండా చేరుపడం కోసం కాదని హితవుపలికారు. తెలంగాణభవన్‌లో శనివారం పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టామని చెప్పారు.
తొలుత ర్యాలీకి అనుమతి ఉందని చెప్పి, ఆ తర్వాత అనుమతి లేదని వేలాది మందిని తమ పార్టీ కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను, పార్టీ సీనియర్ నాయకులను సాధారణ ప్రజలను ఎకడికి అకడ అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. అరాచకంగా, అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికార శాశ్వతం కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. శాంతి ర్యాలీని భగ్నం చేశామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందవచ్చు కానీ, కోర్టుకు వెళ్లి కోర్టు అనుమతితో బ్రహ్మాండంగా శాంతి ర్యాలీ మళ్లీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శాంతి ర్యాలీ మాత్రమే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలతో సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు సికింద్రాబాద్‌ను జిల్లాగా మారుస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు వారి డిమాండ్లను రాబోయే తమ ప్రభుత్వంలో నెరవేర్చుతామని తెలిపారు.
చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయే ప్రమాదం
‘రెండేండ్ల్లలో హైదరాబాద్‌లో ఒక కొత్త రోడ్డు వేశావా? ఒక ఫె్లై ఓవర్ కట్టావా? అని రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీకు అధికారం ఇచ్చింది ప్రజల హకులు కాపాడటానికని కానీ మీరు చేస్తున్నదేంటి? అని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. ప్రజల దగ్గరికి పాలన పోవాలని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని, వీకేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కొత్త గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు తీసుకొచ్చారని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగామార్చారని అన్నారు.
హైదరాబాద్‌లో నాలుగు జోన్లు ఉంటే.. ఆరు జోన్లుగా చేసుకున్నామని తెలిపారు. ఇన్ని చేసినా హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఏనాడూ టచ్ చేయలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజలగొప్ప అస్తిత్వం చిహ్నాలు అని చెప్పారు. రేవంత్‌రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వల్ల సికింద్రాబాద్‌కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న జిల్లాలను తీసేయడానికి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త కలెక్టరేట్లు అద్భుతమని, కొన్ని రాష్ర్టాల్లో సచివాలయాలు కూడా ఇలా లేవని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్తోనే హైదరాబాద్, సికింద్రాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు. అందరం కలిసి కట్టుగా పోరాడి సికింద్రాబాద్ చారిత్రక గుర్తింపును కాపాడుకుంటాం. సర్కార్ కుట్రలను తిప్పికొడతామన్నారు.
కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్లం
ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే తాము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్లం కదా.. అని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ నిలదీశారు. సెక్రటేరియట్ ముందు అనుమతి లేకుండా రేవంత్‌రెడ్డి ర్యాలీ చేస్తే ఒప్పు.. తాము ర్యాలీకి పిలుపునిస్తే తప్పా? అని ప్రశ్నించారు. కర్ఫ్యూను తలిచినట్టు వేలాది మంది పోలీసులను పెట్టి అందరిని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌కు అద్భుతమైన చరిత్ర ఉన్నదని, రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని, చరిత్రను మార్చే ప్రయత్న చేయడం దారుణమని విమర్శించారు. సికింద్రాబాద్ అస్తిత్వం ఇక్కడి ప్రజల హకు, ఆత్మ గౌరవానికి సంబంధించిందన్నారు.జంట నగరాలు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్, కానీ ఈ రోజు జంట నగరాల్లో ఒక నగరాన్ని పూర్తిగా తుడిచి వేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ ప్రజల కోసం మాట్లాడితే తనపై కేసులు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. ఇతర నేతల గురించి దారుణంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులపైన కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు.
అర్ధరాత్రి రద్దు చేశారు
‘సికింద్రాబాద్ కోసం సికింద్రాబాద్‌లోని ఆటో అన్నల నుంచి మొదలుకొని బస్త్తీవాసుల దాకా అందరూ కొట్లాడుతున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు శాంతి ర్యాలీకి అనుమతి ఇచ్చామని పోలీసులు చెప్పారు. రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ రాత్రి అనుమతిని రద్దు చేసుకుంటున్నట్టు పోలీసులు చెప్పారు. ఐదు రోజుల నుంచి అనుమతి ఇచ్చేయమని చెప్పి అర్ధరాత్రి రద్దు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, క్లాక్ టవర్ వద్ద వేలాది మంది పోలీసులను పెట్టి వేలాది మంది ప్రజలను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. మా ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం. మరోసారి కోర్టు అనుమతి తీసుకొని వచ్చి మొదటి వారంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తాం. కేవలం శాంతి ర్యాలీ మాత్రమే కాదు అనేక ఇతర కార్యక్రమాలు కూడా చేస్తాం’ అని తలసాని స్పష్టం చేశారు.
చరిత్ర కనుమరుగు చేసే యత్నం..
సికింద్రాబాద్ ప్రజల్లో ఇవాళ 220 ఏండ్ల చరిత్ర కనుమరుగు అవుతున్నదనే ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. సికింద్రాబాద్ అంటే కేవలం రైల్వేస్టేషన్ కాదని, అనేక భాషలు, సంస్కృతుల సంగమ కేంద్రమని చెప్పారు. సికింద్రాబాద్‌కు ప్రత్యేకమైన చారిత్రక, సాంస్కృతిక ప్రతిపత్తి ఉన్నదని తెలిపారు.