రంగారెడ్డి, జూన్ 27 (నమస్తేతెలంగాణ) /కందుకూరు: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్‌పై అవగాహన, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మహేశ్వరంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా.. ‘కాంగ్రెస్ పోవాలి…బీఆర్ఎస్ రావాలి’.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి’ అన్న భావన ప్రజల్లో కనిపిస్తున్నదన్నారు. రాష్ట్రంలో వికాసం పోయి.. విధ్వంసం కొనసాగుతున్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే దిక్కులేకుండా పోయిందన్నారు. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతున్నదన్నారు. కేసీఆర్‌కు ప్రజలు పాలన అప్పగిస్తే.. తెలంగాణను ఆయన దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టారని, రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే సమయంలో పొరపాటున తెలంగాణ ద్రోహి రేవంత్‌ను ముఖ్యమంత్రిని చేశారన్నారు. దీంతో రాష్ట్రంలో ప్రగతి పూర్తిగా కనుమరుగైందని, అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై అసంతృప్తి వెల్లగక్కుతున్నారని చెప్పారు. 420 అబద్ధాలతో ప్రజలను ఆగంచేసి గద్దెనెక్కిన రేవంత్ సంక్షేమ పథకాలన్ని నీరుగార్చారన్నారు.
యాప్‌లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాయం
ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా షాపుల్లో లేదని, యాప్‌లల్లో ఉందని, ఆ యాప్‌లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు స్థానమే లేదన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో రేవంత్‌రెడ్డికి రైతులు కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంటు కోతల కాలం మొదలైందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా ఇచ్చేదని, ప్రస్తుతం రోజుకు 6 నుంచి 10 సార్ల వరకు కరెంటు పోయి
వస్తున్నదన్నారు.
రైతుబంధు పోయి.. రాహుల్ బంధు వచ్చే..
రైతు బంధు పోయి.. రాహుల్ బంధు వచ్చిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు టకాటకా పడేదని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ఊసే కనిపించడంలేదని కేటీఆర్ అన్నారు. 70 లక్షల మంది రైతులకు ఏడాదికి రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చేదని, కాంగ్రెస్ సర్కార్ రైతుబంధును రైతు భరోసాగా మార్చి.. ఒకరిద్దరు రైతులకే ఇస్తున్నదని, రేవంత్ సర్కార్
అసమర్థ పాలన కొనసాగిస్తున్నదన్నారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారం
సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బంధువులు ప్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాకతో రెండున్నరేండ్లలో రియల్ వ్యాపారం దివాళ తీసింది. కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. కేటీఆర్ మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా రూ, 4వేల కోట్లతో 24వేల 800 వందల కంపెనీలు తీసుకొచ్చారు. కేసీఆర్ పాలన రాష్ర్టానికి శ్రీరామ రక్ష. మళ్లీ ఆయన పాలనను తెచ్చుకోవాలి.
– సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే
సీఎం రేవంత్‌రెడ్డిది తుగ్లక్ పాలన
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఉనికిని దెబ్బతీస్తున్నారు. బలవంతంగా రైతుల భూములను గుంజుకుంటుండటంతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. ప్యూచర్ సిటీ పేరుతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలన
అస్తవ్యస్తంగా మారింది.
– మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
బంగాళాఖాతంలో కలపాలి
ప్రజలకు మోసపూరిత వాగ్ధానాలను చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి. కేసీఆర్ పాలన ఎలా ఉండే ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలన ఎలా ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను నెరవేర్చాలి. పాలన చేతకాక పోతే గద్దె దిగాలి.
– అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే
ఐక్యంగా పనిచేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ఐక్యంగా పని చేయాలి. ప్రతి పోలింగ్ బూత్‌లో అర్హుల ఓట్లను తొలగించకుండా చూసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను సాగనంపి కేసీఆర్ పాలనను తెచ్చుకోవాలి.
– సురభివాణీదేవి, ఎమ్మెల్సీ