హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ హయాంలో రందీలేకుండా బతుకెళ్లదీసిన ఆటోవాలాలు కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జూబ్లీహిల్స్ నుంచి తెలంగాణ భవన్‌వరకు ఆటోలో ప్రయాణించి ఆటోడ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు నలిగిపోయానని కేటీఆర్ వాపోయారు. ప్రతినెలా వెయ్యి రూపాయల భృతి ఇస్తామని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి మోసం చేయడంతో 161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
ఓట్ల కోసం ఉద్దెర హామీలు..
నాడు ఓట్ల కోసం ఉద్దెర హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి..ఇప్పుడు ఓటేసిన ప్రజలను నిలువునా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఖాతాల్లో జమచేస్తామని, బిడ్డ పెండ్లి చేస్తే తులంబంగారం పెడతామని అరచేతిలో స్వర్గం చూపి ఇప్పుడు ఖజనాల్లో పైసల్లేవని సాకులు చెబుతున్నారన్నారు.
దండుపాళ్యం బ్యాచ్‌కు ఓటుతో బుద్ధిచెప్పాలి..
రెండేళ్లలో దండపాళ్యం ముఠాలాగ ప్రజలను దోచుకుతిని ఢిల్లీకి మూటలు పంపిన కాంగ్రెస్ నేతలకు..గల్లీలో ఉన్న గరీబోళ్లకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు మనసత్తలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటుకు రెండు, మూడు వేలు పంచి అడ్డదారిలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. దండుపాళ్యం ముఠా దిగి మాయమాటలు చెప్పి ఏమార్చేందుకు యత్నిస్తున్నదని.. ప్రజలు ఆలోచించి ఓటువేయాలని కోరారు.
4లక్షల ఓటర్లతో 4కోట్ల మందికి మేలు..
జూబ్లీహిల్స్‌లోని 4 లక్షల మంది ఓటర్ల చేతిలో నాలుగుకోట్ల తెలంగాణ భవితవ్యం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ఇక్కడ ఓటుతో చెయ్యిని దెబ్బకొట్టి హస్తంపార్టీ నేతల కండ్లు తెరుస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ఓడగొడితేనే రూ.2 వేల పింఛన్‌ను 4 వేలు చేయాలనే, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇవ్వాలనే, ఆటోడ్రైవర్లకు నెలకు వెయ్యి భృతి ఇవ్వాలని సర్కార్‌కు సోయివస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్లో చేరికలు..
తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ పరిధిలోని బోరబండ, షేక్‌పేట, రహ్మత్‌నగర్ ప్రాంతాలకు చెందిన ఆటోడ్రైవర్లు, మైనార్టీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని వారిని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్లో చేరినవారిలో బోరబండకు చెందిన జావెద్, ఫయాజ్, షేక్ అబ్దుల్లా హమీద్, అంజద్ అలీ, షాఖాన్, అబ్దుల్‌గనీ, హసద్, జహింగీర్, మజీద్, మౌలనా, షాహేద్ సల్మాన్, పర్వేజ్ తదితరులు ఉన్నారు.
లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
అమీర్‌పేట్, అక్టోబర్ 27: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్.. ఆటో డ్రైవర్లకు బకాయిపడిన సొమ్ము (ఒక్కొక్కరికి) రూ.24 వేలను వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావుతో కలిసి హరీశ్‌రావు సోమవారం ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ విధానాల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 161 మంది ఆటోడ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వారందరికీ ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటోడ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పాటు పడింది బీఆర్ఎస్ సర్కార్ మాత్రమేనన్నారు.