‘హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరాచకం చేశారు. వేలాది మంది పేదల ఇళ్లు కూల్చి వారి బతుకులను రోడ్డున పడేశారు. కేవలం పేదలనే లక్ష్యంగా దూసుకెళ్తున్న హైడ్రా బుల్డోజర్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇకనుంచి బస్తీల జోలికి బుల్డోజర్లు రావద్దంటే ఈ నెల 11న జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు పట్టంకట్టాలి. మీ ఓటుతో రెండేళ్ల అరాచకాన్ని, అవినీతిని తరిమికొట్టి కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి. మాయమాటలతో కంటోన్మెంట్లో గెలిచి రూపాయి పని చేయనోడు.. జూబ్లీహిల్స్‌లో చేస్తడా? కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు’
– వెంగళరావునగర్ రోడ్‌షోలో కేటీఆర్
సిటీబ్యూరో/వెంగళ్రావునగర్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ) : రెండేళ్లలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నగరాన్ని అథః పాతాళానికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నగరాన్ని పతనావస్థకు చేర్చి రియల్ ఎస్టేట్ మొదలు ఆటోడ్రైవర్ల దాకా అందరి ఉపాధి అవకాశాలపై దెబ్బకొట్టి వారి ఆత్మహత్యలకు పాల్పడేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా కేటీఆర్ వెంగళ్రావునగర్ డివిజన్లోని యాదగిరినగర్ నుంచి కృష్ణకాంత్‌పార్కు చాకలి ఐలమ్మ విగ్రహం వరకు రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి చేస్తామన్న సీఎం అబద్ధాలపై కేటీఆర్ మండిపడ్డారు. గతంలో ఇవే మాటలు చెప్పి కంటోన్మెంట్లో గెలిచిన తర్వాత ఒక్క రూపాయి పని కూడా చేయలేదన్నారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము అడుగుతున్నామని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే 24నెలల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చూపించి ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

పదేళ్లలో ఐటీ పరిశ్రమ మొదలు టిమ్స్ ప్రభుత్వ దవాఖాన నిర్మాణం, ప్రజారోగ్యం, రోడ్లు, ఫ్లై ఓవర్లు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 42 ఫ్లైఓవర్లు అన్నింటి కన్నా హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని కేటీఆర్ వివరించారు.
మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోకు ప్రజలు పోటెత్తారు. దారిపొడవునా ఎటుచూసినా జన ప్రభంజనమే కనిపించింది. పాదయాత్రలు, బైక్‌ర్యాలీల ద్వారా సభాస్థలాలకు తరలివచ్చి కేటీఆర్‌కు బ్రహ్మరథం పట్టగా ధూంధాం అటపాటలతో గులాబీ దళం ఉర్రూతలూగించింది. వేలాది సంఖ్యలో తరలివచ్చి బీఆర్ఎస్కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రోడ్ షో దారులన్నీ గులాబీమయం అయ్యాయి. కేటీఆర్ తనదైన మార్కు ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి హైడ్రా అరాచకాలు, సీఎం మోసపూరిత హామీలను కండ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

కేసీఆర్ పదేండ్ల పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి రూ.5300 కోట్లకు పైగా వెచ్చించామని వివరించారు. బీఆర్ఎస్ పదేళ్లలో సాధించిన ప్రగతిని, కాంగ్రెస్ రెండేళ్ల ఆరాచక పాలనను బేరీజు వేస్తూ ప్రజలకు పూసగుచ్చినట్టు వివరిస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గులాబీ జెండాలు పట్టుకుని ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పి.విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రదీప్ చౌదరి, కార్పొరేటర్లు దేదీప్య తదితరులు పాల్గొన్నారు.